– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద
– అధిక శాతం ఫిర్యాదులు గృహ హింసపైనే..
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నారీ న్యాయ్: హియర్ హర్ ఔట్ అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నుంచి ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్థిక, సైబర్ క్రైమ్ తదితర సమస్యలకు సంబంధించిన మహిళా బాధిత ఫిర్యాదులను స్వీకరించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కొనసాగిన ఈ విచారణలో చైర్‌పర్సన్ శారద, అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సెప్టీ డీసీపీలు డాక్టర్ లావణ్య, టి.ఉషారాణి, జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకటాచారి వందమందికిపైగా మహిళలు సమర్పించిన ఫిర్యాదులకు తగు పరిష్కారాలు సూచించారు. అలాగే సంబంధిత శాఖల నుండి చర్యలు, పెండిరగ్ ఫిర్యాదులపై నివేదికలు కోరారు. మహిళల ఆవేదనను విని వారికి న్యాయం చేకూరేలా, త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టేలా చూడటానికే ‘నారీ న్యాయ్: హెయిర్ హర్ ఔట్’ అనే బహిరంగ విచారణ ఏర్పాటు చేశామని, వివిధ విభాగాలను విచారణలో భాగస్వామ్యం చేసినట్లు శారద తెలిపారు. అధిక శాతం ఫిర్యాదులు గృహ హింసపై అందాయని, ఎక్కువ ఫిర్యాదుల్లో నిందితులు ఎన్.ఆర్.ఐలై ఉండటం వల్ల ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్ళి తగు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనేక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజా రమణ, సభ్యులు షాహిన్ అఫ్రోజ్, ఈశ్వరిబాయ్, శుద్ధం లక్ష్మి, గద్దల పద్మ, కొమ్ము ఉమాదేవి యాదవ్, ఎ.రేవతి రావు, జిల్లా సంక్షేమ శాఖాధికారులు అక్కేశ్వర్‌రావు, రాజేందర్, ప్రవీణ్‌కుమార్, ఆర్.కోటాజీ, జి.ఆశన్న, ఇలియాజ్ అహ్మద్, వివిధ శాఖాధికారులు, వివిధ జోన్‌ల పోలీస్ అధికారులు, సఖి నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




