మెరుపు తీగెలు
దేవుడు నన్ను కోతిని చేశాడు! అప్పుడు నేను పళ్ళికిలిస్తూ దేవుణ్ణి చూసి నవ్వాను! దేవుడూ నన్ను చూసి నవ్వాడు!
దేవుడు దొడ్డవాడు. అన్నీ యెరిగిన వాడు. నేను చెప్తే తప్ప నా కష్టాలు తెలుసుకోలేనివాడు కాదు. అయినా నేను నా కష్టాలన్నీ మొరపెట్టుకున్నాను. విన్నాకే వుత్కృష్టమైన మానవజన్మలోంచి నన్ను విడిపించి కోతిని చేశాడు. ఎందుకిలా చేశావని నేనేం అడగలేదు. ఎందుకంటే నాగురించి నాకంటే దేవుడికే బాగా తెలుసు!
దేవుడి గురించి నాకేమీ తెలీదు. నాకు కష్టమొస్తే దేవుడు ఆరుస్తాడు. తీరుస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. ఊపిరి పోసినవాడే వూరటనిస్తాడు. ఆ విశ్వాసంతోనే దేవునిమీద భారం వేశాను. ‘నీ అన్ని సమస్యలకూ యిదే పరిష్కారం పో’ అన్నాడు దేవుడు!
ఆ ఆనందంలో యెగిరి గంతులేశాను. నిజం, మోకాలి నొప్పులు లేవు. గబగబా నాలుగు అడుగులు వేయలేని నేను చెట్టు చిటారు కొమ్మలకెక్కాను. అక్కడి నుండి దూకాను. వొత్తికొత్తినే షుగర్‌తో కళ్ళుతిరిగి పడిపోయే నేనేనా తల్లక్రిందులుగా వేలాడింది? నాలుగడుగులు వేస్తే ఆయసపడిపోయి గుండె ఆగిపోతుందేమోనని బీపీ పెంచుకొనే నేనేనా యీ కొమ్మ మీంచి ఆ కొమ్మ మీదికి దూకుతోంది? ఆఫీసూ లేదు… అన్‌రెస్టూ లేదు… యింత ఫ్రీగా వున్నానేమిటో? నా పెళ్ళాం కోతీ నా పిల్లకోతులూ కూడా నాలాగే గంతులేస్తున్నారు. అరే, గెంతిన తల్లి పిల్లకోతిని పట్టుకోవడం లేదే? పట్టుకొన్న పిల్లదేనా ఆ బాధ్యత? ఎవరి తాలూకా భాద్యత వారిదే!
ఇప్పుడు యీ యిల్లు నాది… యీ తోట నాది… యీ సంపద నాది… అని యేదీ లేదు, యాతన అసలే లేదు. అరే నేనున్న చెట్టు కూడా నాదనుకోవడం లేదే? ఈ అడివి నాదనుకోవడం లేదే? అడివిలో వున్నవన్నీ నావనుకోవడం లేదే? ఇదేంటి నేను యేమీ దాచుకోవడం లేదు? నాకు రేపు లేదా? ఈ క్షణమే వుందా? ఈ చిన్ని పింజిని కొరికిన వగరు యింత రుచిగా వుందేంటో? ఈ కాయతో పండుతో కడుపు నిండిపోతోందేమిటో? జాతి యెంచకుండా అన్ని కోతులతో కలిసిపోతున్నానే? కాని యిదేదో బాగుందే? స్ట్రెస్ యేదో తీసేసినట్టు నా వొళ్ళూ బుర్రా యింత తేలికయిపోయిందేమిటి?
కాలం లేదు. దానికి కొలతలు లేవు. వాచ్ లేదు. దాని ముల్లులా ఆగకుండా పరిగెత్తడం లేదు. టార్గెట్ లేదు. అచీవ్మెంట్ లేదు. ‘నేను’కు యేత్వం లేదు. దీర్ఘం లేదు. అంతా మనం మనమే. అన్నీ కోతులే. అందరికీ అన్నీ!
అప్పుడు నా ముందరికొచ్చినవాడు ‘వొరే కోతిగా’ అని పిలిచాడు. నాకు కోపం రాలేదు. నువ్వెవరు అని తిరిగి అడగలేదు. నేను యెవరనే ప్రశ్నకూడా నాకు లేదు?! పోల్చుకోలేదనేమో ‘నేను దేవుణ్ణి’ అని చెప్పాడు. అవునా అని యీ కోతిగాడూ చెయ్యిత్తి నమస్కారం కూడా పెట్టలేదు. తోక మాత్రం వూపాను, నాకు తెలీకుండా. అసలేదీ గుర్తులేదు!
ఇప్పుడు జీవితం దేవుడు ఆడిన ఆటకాదు, కోతిగా నేను ఆడిందే ఆట.
బమ్మిడి జగదీశ్వరరావు





