పార్టీలో నా వర్గాన్ని దూరం పెట్టారు

– రాజకీయంగా దెబ్బకొట్టేందుకు యత్నాలు
– కాంగ్రెస్ తీరుపై జీవన్ రెడ్డి ఆవేదన

జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన మెడ నరకడానికి పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన భుజాలుగా ఉన్న వ్యక్తులను తనకు దూరం చేశారని చెప్పారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రచారం సందర్భంగా పార్టీకి చెందిన మహిళలు, కార్యకర్తలతో ఆయన తన బాధను చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో వారు జీవన్‌రెడ్డిని ఓదార్చారు. మున్సిపాలిటీలో మీ వర్గాన్ని గెలిపించి తీరుతామని చెప్పారు. కాగా, చట్ట సభలకు ఏ పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీలోనే ఉండాలని గతంలో రాహుల్‌గాంధీ చెప్పిన విషయాన్ని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని గతంలో చెప్పారని, కానీ రేవంత్ రెడ్డే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వేరే పార్టీల్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్లను ఓటుతో కొట్టాలని తాను అంటున్నానని చెప్పారు. తన వర్గం వారికి సీట్లు నిరాకరించడంతో కొన్ని వార్డుల్లో స్వతంత్రులుగా బరిలో దిగిన తన వర్గం వారి తరఫున జీవన్‌రెడ్డి ప్రచారం చేశారు. బీఆరఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వర్గాన్ని పక్కనపెట్టి తనతోపాటు బీఆరఎస్ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సంజయ్ కుమార్ తాను బీఆరఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *