ఫోన్ ట్యాపింగ్‌పై పార్లమెంటులో ప్రస్తావిస్తా
సిట్ ముందు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దాంతో అభద్రతా భావంతో తన ఫోన్ ట్యాప్ చేయించారని వెల్లడిరచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విశ్వేశ్వర్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులకు శుక్రవారం తన వాంగ్మూలం ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 నవంబర్‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంప విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఎంపీ తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చాక మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు చూపించారని తెలిపారు. తన కార్యాలయంలో వారెంట్ లేకుండా వచ్చి కొందరు పోలీస్ అధికారులు దౌర్జన్యం చేసి ఫోన్ ట్యాప్ చేశారని వెల్లడిరచారు. గత డీజీపీ మహేందర్‌రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనతోపాటు తన అనుచరుల కదలికలను కూడా పసిగట్టారని చెప్పారు. తన స్నేహితుడు బంగారం కొన్న రూ.72 కోట్లను పోలీసులు పట్టుకున్నారని, అవి తన డబ్బులు అన్నట్లు ఫోన్ ట్యాప్ బెదిరించారని తెలిపారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వివరించారు. తన భూమి అమ్మితే కొన్న వ్యక్తి పైసలు ఇచ్చారని, అతన్ని కూడా హింసించి రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించారని విశ్వేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. ఈటల రాజేందర్‌కు డబ్బులు ఇచ్చినట్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో తనపై నిందలు మోపారన్నారు. తాను ఈటలకు ఎన్నికల సమయంలో సపోర్ట్ చేశానని, కానీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తన మొబైల్ రికార్డింగ్ ట్యాప్ కాకపోవడంతో లైవ్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. తనతోపాటు తన భార్య సంగీత ఫోన్‌ను సైతం ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తనపైనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుతోపాటు ఈ ట్యాపింగ్‌లో ప్రధాన భాగస్వాములైన కేసీఆర్, కేటీఆర్‌లును కఠినంగా శిక్షించాలని ఎంపీ కొండా కోరారు. అలా చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అన్నారు.



