– ఇజ్రాయిల్ దాడులకు దీటుగా ఇరాన్ బాంబులు
– టెహ్రాన్ ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతిక కాయం
– మూడు రోజులపాటు ప్రజల సందర్శనకు అనుమతి
టెహ్రాన్, మార్చి 4: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదో రోజైన బుధవారం మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఇరాన్‌లోని ఉర్మియా, కెర్మాన్‌షా నగరాలకు కూడా దాడులను విస్తరించింది. తూర్పు టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డజన్లకొద్దీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ క్షిపణులు సౌదీలోని ఎంబసీని, దుబాయ్‌లోని యూఎస్ కాన్సలేట్‌ను ఢీకొట్టాయి. ఖతార్‌లోని అల్ ఉదేద్ ఎయిర్‌బేస్‌పై కూడా ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. కెర్మాన్ సిటీ శివార్లలో ఇజ్రాయెల్‌కు చెందిన హెర్మేస్ డ్రోన్‌ను కూల్చేసినట్టు కెర్మాన్ ప్రావిన్స్‌లోని ఐఆర్‌జీసీ ప్రాంతీయ విభాగం తెలిపింది. గత 24 గంటల్లో మూడు హెర్మేస్ డ్రోన్‌లను కూల్చేసినట్టు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని ఇరాక్ ’ఎర్బిల్ బేస్’, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్‌బేస్, అరిఫ్‌జాన్ ఎయిర్ బేస్ సహా అమెరికా సైనిక స్థావరాలపై ఇంతవరకూ 230 డ్రోన్లు పేల్చినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ గత శనివారం టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకూ ఇరాన్‌లో 800 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదు రోజుల్లో ఇరాన్‌లోని 1,700 లక్ష్యాలపై దాడులు చేసినట్టు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. వీటిలో నావికాదళ నౌకలు, సబ్‌మెరీన్లు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీకి ప్రజలు బుధవారం రాత్రి నుంచి మూడు రోజులు నివాళులు అర్పించనున్నారు. పేటికలో ఉంచిన ఆయన మృతదేహాన్ని టెహ్రాన్‌లోని ప్రార్థనా మందిరంలో ఉంచనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





