చిన్న కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించాలి

– బిల్లులు రాక‌ ‘మన ఊరు – మన బడి’ కాంట్రాక్టర్ల ఇబ్బందులు
– క‌మీష‌న్ల కోసం బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపు
– చిన్న కాంట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు
– రెండున్న‌రేళ్లుగా 1500మందికి చెల్లింపులు బంద్‌
– అడిగితే పోలీసు కేసులు
– హ‌రీష్‌రావు డిమాండ్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23: కేసీఆర్‌ ప్ర‌భుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాం. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోంద‌ని బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు ఆరోపించారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్న మన ఊరు మన బడి సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం ఆయ‌న్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించడం లేదని, న్యాయంగా అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వారు వాపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ‘ఎక్స్’ వేదికగా హ‌రీష్‌రావు స్పందిస్తూ అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమ‌న్నారు. చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? మీకు కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్లను బిల్లును గాలికి వ‌దిలేశారా అని ప్ర‌శ్నించారు. తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వరు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేడుకున్నా స్పందన లేదు. చివరికి, సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంపై శాసనమండలి చైర్మన్ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశార‌ని గుర్తుచేశారు. బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని, తమ సొంత ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బిల్లులు విడుదల చేయాలని తాను స్వయంగా ముఖ్యమంత్రిని కోరినా.. బిల్లులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమ‌న్నారు. కనీసం ఇప్పుడైనా ‘మన ఊరు – మన బడి’ కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా లేక ఆ డబ్బును కూడా కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెడతారా అని ప్ర‌శ్నించారు. ఆ 1500 మంది పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *