హెచ్ఎంపివి వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

  • భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.. జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రి..
  • వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 6 :   హెచ్ఎంపివి వైర‌స్  అనేది కొత్త వైరస్ కాదు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉంద‌ని వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్ల‌డించారు. దీనిప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సోమ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో సూచించారు.  ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందని, వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వొచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది.  చైనాలో ఈ సంవత్సరం హెచ్ఎంపివి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోంద‌న్నారు.

ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామ‌ని చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు రెగ్యులర్‌‌గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారని వివ‌రించారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేద‌ని,  జాగ్రత్తగా ఉంటే సరిపోతుంద‌న్నారు.  రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉంది.  డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తే, ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తుంద‌ని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *