– మంచిరేవులలో ఆలయాలను పునర్నిర్మిస్తాం
– ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం
– అడ్డుకునేవారిని చరిత్ర క్షమించదు
– సీఎం రేవంత్ హెచ్చరిక
– మచిలేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల పునర్నిణానికి శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: మూసీ నదీ తీరాన రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల సముదాయం పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, శంఖునాదాలు, గంటానాదాల మధ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చారిత్రక మందిరాన్ని పునర్నిర్మించుకోవడం ఒక చారిత్రక సందర్భం.. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతున్నదని అనుకోవట్లేదు.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం అని చెప్పారు. ఎనిమిది ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవానికి చాలామంది ప్రయత్నించారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.. ఆ అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడన్నారు. ‘రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది.. సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగింది.. సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదు.. మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్యకారకంగా మారింది.. గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది.. దిల్లీ వంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి.. అలాంటి నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంద’ని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక అని, మూసీ పరీవాహకంలో చారిత్రక శివాలయాన్ని పునర్నిర్మించాలని ఈశ్వరుని ఆశీర్వాదంతో పనులు మొదలుపెట్టామని, దీనిపై పెడర్ధాలు తీసి విమర్శించే వారిపై ప్రజలే శివతాండవం చేస్తారని వ్యాఖ్యానించారు. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నామంటూ మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలు చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములని విమర్శించారు. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందేనని రాజకీయాలకతీతంగా మద్దతిస్తున్నారు కానీ తాము చేయలేనిది ఎవరూ చేయొద్దనే అక్కసుతో కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో పదవులు అనుభవించిన ఆ అక్క కొడుకు అభివృద్ధిని అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా.. మా అక్కకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. నీ పుత్రరత్నం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసును వెనక్కి తీసుకోండి.. లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారన్నారు. మీ వెనక ముసుగు తొడుక్కున్న వారికి కూడా చెబుతున్నా.. ఇలాగే వ్యవహరిస్తే ఇప్పుడున్న స్థానం కూడా వారికి ఉండదు.. ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా ఈ ప్రాజెక్టు ఆగదు. ఇది శివ దీక్ష.. రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతాం.. ఇది ఓట్ల కోసం.. నోట్ల కోసం చేస్తున్న పని కాదు.. ఇది చరిత్రలో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం.. ఇది ప్రజల పట్ల తమకున్న చిత్తశుద్ధి.. ప్రజలే తమకు దేవుళ్లు.. అంతిమంగా వారి ఆకాంక్షల మేరకే ముందుకు వెళతాం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





