వరద నిర్వహణకు మూసీ పునరుజ్జీవనమే పరిష్కారం

– భారీ వర్షాలు పడినా నగరం తట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు
– నీటి ప్రవాహనికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా చర్యలు
– చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం
– తాగునీటితోపాటు డ్రైనేజీ, ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం
– నగరంలో వరద సమస్యపౖౖె సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మూసీ పునరుజ్జీవనమే హైదరాబాద్‌ నగర వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చన్నారు. ఆ దిశగా హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వర్షాలతో తలెత్తుతున్న ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైదరాబాద్‌ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతోపాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్‌ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి గురువారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి అత్యధికంగా 15 సెం.మీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌ స్తంభించటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో ముంపు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సాధారణంగా మూడు నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో చర్చకు వచ్చింది. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లు నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు అయిదు సెం.మీ వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెం.మీ వర్షం నమోదవుతోందని అన్నారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెం.మీ వర్షపాతం కురిసింది. జూన్‌ నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎంత వర్షం పడినా గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని, అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో 55 కి.మీ పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతోపాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతోపాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవకుండా ఉంటాయన్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

చెరువుల, కుంటలను మూసీకి అనుసంధానం చేయాలి

నగరంలో ఉన్న హుస్సేన్‌ సాగర్‌, దుర్గం చెరువు, మీర్‌ అలం చెరువుతోపాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేందుకు వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీరుతాయన్నారు. కలుషితమైన నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఇకపై ఈ పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుందన్నారు. భవిష్యత్‌లో వందేళ్ల పాటు మహానగరంలో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.

ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రత మరింత పెరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పాతనగరంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రియల్‌ జోన్‌ను ఏర్పాటు చేసి పార్కింగ్‌ సమస్యకు చెక్‌ పెట్టాలని సూచించారు. చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్‌ ప్రాంతాల్లో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ జోన్‌ల ఏర్పాటుతో రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు పార్కింగ్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్‌, హెచ్‌ఎండీఏ పరిధిలోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్‌ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *