– ప్రక్షాళనపై పుట్టిన రోజున మాటిచ్చి మరిచిన సీఎం
– బీసీలకు న్యాయం చేసింది బీజేపీ – వంచించింది కాంగ్రెస్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రధానంగా రైతుల ఆధారిత ప్రాంతమైన భువనగిరి(Bhongir) జిల్లాలో మూసీ నది ప్రక్షాళన, శుద్ధిచేయడం అత్యవసరమని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు (Ramachandarrao) అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం గతంలో బీజేపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టరు కె.లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ ఉద్యమించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ఇక్కడ పర్యటించి మూసీని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, చేతల్లో అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తాము చేయలేని పనిని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట దిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ధర్నా వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకేనన్నారు. ధర్నాకు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ హాజరు కాలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బీసీలకు రిజర్వేషన్లు తీసుకొస్తామని రేవంత్ చెబుతున్నారు.. అంటే రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు.. బీసీ రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అనేది దాని అర్థం అని ఎద్దేవా చేశారు. నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్-ఇండీ అలయెన్స్ పార్టీలు అధికారంలోకి వస్తే (అసంభవం) ఒక బీసీని ప్రధాని చేస్తామని ప్రకటించాలని రామచందర్‌రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిందన్నారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీ కేవలం షాడో బాక్సింగ్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసులో అధికారులను మాత్రమే అరెస్టు చేశారు కానీ అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందుదొందేనన్నారు. బిజెపి ముస్లింల రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. ముస్లింలలో దూదేకుల, ఫకీర్లు వంటి తెగలు ఇప్పటికే బీసీ-బి కింద రిజర్వేషన్లు పొందుతున్నారు. కేవలం విద్య, ఉద్యోగాల్లో ఉండాల్సిన రిజర్వేషన్లకు బదులు అదనంగా 4% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి అసలైన బీసీలకు అన్యాయం చేశారు. భువనగిరిలో రాబోయే ఎలాంటి ఎన్నికల్లోనైనా బీజేపీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
చేనేతకు తోడుగా మోదీ ప్రభుత్వం
జాతీయ చేనేత దినోత్సవం(national handloom day) సందర్భంగా యాదాద్రి టౌన్‌లోని బీసీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రామచందర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో చేనేత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. చేనేతల కష్టాలు మోదీకి తెలుసునని, అందుకే కేంద్రం చేనేతకు తోడుగా నిలబడిరదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విచారకరమని అన్నారు. ముద్ర లోన్లతో నేత కార్మికుల వ్యాపార అభివృద్ధికి దోహదపడ్డారంటూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సిరిసిల్లలో పదేళ్లుగా ఆదరణ లేక చాలామంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన దుర్ఘటనలు మనమంతా చూశాం.. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేనేతను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని చెప్పారు. ఎక్కడ చేనేత పరిశ్రమలున్నాయో అక్కడ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. చేనేత ఉత్పత్తులు ఈ ప్రాంతానికే పరిమితంగా కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను మోదీ ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. నిత్య జీవితంలో అందరం చేనేత దుస్తులు ధరించే అలవాటు చేసుకోవాలన్నారు. వరంగల్‌లో రూ.10 వేల కోట్ల వ్యయంతో నేషనల్ హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందని, ఇది ప్రారంభమైతే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని రామచందర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే బిజెపి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉందన్నారు.



