– ప్రజలకు నష్టం లేకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు
– అవినీతి కోసమే లక్షన్నర కోట్లతో ప్రణాళిక
– నది అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు
– ఇళ్లు కూలగొడతామంటే ఒప్పుకోం
– మూసీ భూములపై రేవంత్ కన్ను
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ₹16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాం తాల్లో 6 కి.మీ మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విద్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు. హిమాయత్ సాగర్ వేదికగా ఆయన మూసీ పునరుజ్జీవం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయిం ట్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంఫాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేలమంది ఇండ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టాలను, ఇతర నిబంధనలను అన్నింటినీ పాతర వేసి వేల కోట్ల అవినీతికి తెగబడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భూదాహానికి రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలను వ్యతిరేకిస్తమన్నారు. పార్టీలకతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం.. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమాలు చేసి సాధించుకున్న భూమి పుత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామన్నారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇళ్లను, భూములను కాపాడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కోట్ల ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పిపిటి ఇస్తే,మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి ఈరోజు మేము వివరిస్తున్నాం. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనం అయింది.
వందల కిలోమీటర్ల నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు
వందల కిలోమీటర్ల నమామి గంగేకి ఖర్చు 42 వేల కోట్లు. 55 కి.మీ మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే మా ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుండా మూసీ పక్కన ఉన్న భూముల కోసం పనిచేస్తున్నాడు.. స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేమిటి అని అంటున్నారు. గాంధీ విగ్రహం పెడతా అంటున్న రేవంత్ రెడ్డి గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ప్రజల ఇళ్లను కూగొట్టాలని మా పార్టీ ఏనాడు మూసీ అభివృద్ధి ప్రణాళికలో భావించలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇండ్లను కూలగొట్టే ప్రణాళికను తయారు చేసిందన్నారు. మూసీ అభివృద్ధిలో భాగంగా మూసీకి ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతోపాటు, మూసీలో మురికిని మొత్తం తీసివేసేలా ఎస్టీపీల నిర్మాణాన్ని కోసం ప్రణాళిక రూపొందించి, ఆ మేరకు రూ.3,800 కోట్లకు పైగా నిధులతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించాము. వీటి నిర్మాణం పూర్తి అవుతే ఒక్క చుక్క కూడా మురికి నీరు మూసీలోకి చేరదు. దీంతోపాటు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని ప్రణాళిక సిద్ధం చేశాము. దానికోసం కేవలం 1100 కోట్ల తో కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదే కార్యక్రమానికి అంచనాలు 10 వేల కోట్లకి పెంచి రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా కరప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వరద నీటిని అడ్డుకోవడం కోసం ఎన్ఎస్ డీపీ అనే ఒక ప్రత్యేక పథకాన్ని కూడా ప్రారంభించాము. దీంతోపాటు మూసీలో చెక్ డ్యామ్‌లు, మూసీపైన బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామన్నారు. వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్‌లు, పార్కులు ఇలా అన్నింటిని గత ప్రభుత్వ ప్రణాళికలో పొందుపరిచాము. ఇవన్నీ కలిపి సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాకు వచ్చిన అంచనా వ్యయం కేవలం 16,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి లక్షల కోట్ల రూపాయల ఖర్చు మూసీ పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోంది. కేవలం డబ్బులున్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్‌లో ఉన్నది కదా.. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళ సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్‌లో ఉంది. మంత్రుల ఫామ్ హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నా ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్‌లను, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్‌లను మాత్రం ముట్టుకోనని చెబుతున్నాడు. ఇప్పుడు బఫర్ జోన్ లో ఉన్న వాటిని కులగోట్టి తిరిగి అవే బఫర్ జోన్లో భారీ భవనాలు కడతా అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,300 ఎకరాల భూమిపైన కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మొత్తం భూముల విలువ ₹1,50,000 కోట్లు. ఈ పేదల భూముల కోసమే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారు. ఒక్క డిజైన్ చేసే కంపెనీకే ₹160 కోట్లను ఇచ్చారంటే ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోండి. మూసీ బాధితుల ఇళ్లకు జీరో విలువ ఉందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగవద్దని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కేవలం ఒకటి రెండు అపార్ట్‌మెంట్ వాసులకు ఇళ్లు కట్టించి తగిన స్థలం ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి అదే సూత్రం అందరు బాధితులకు వర్తింపజేస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డికి తన కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత అనే అంశంపైన అవగాహన కూడా లేదు. ఎవరికీ నష్టం లేకుండా మూసీని అభివృద్ధి చేసే గత ప్రభుత్వ ప్రణాళిక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. దాన్ని చూసి కేవలం ₹16,000 కోట్లతో ఖర్చుతో మూసీని అభివృద్ధి చేయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీ బాధితులు ప్రభుత్వ ప్రణాళికలపై ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. దశాబ్దాలుగా స్థిరపడి జీవనం సాగిస్తున్న తమ బతుకులను ఆగం చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో విప్ వివేకానంద గౌడ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ తదితరులు బాధితుల పక్షాన నిలిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





