ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

– పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక
– గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద
– ఆయా ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పర్యటన
– ఎంజిబిఎస్‌ ‌సందర్శించి పరిస్థితిపై ఆరా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్‌సాగర్‌ ‌గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్‌ ‌నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్‌ ‌వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తున్నది. ఎంజీబీఎస్‌ను వరద చుట్టుముట్టింది. బస్టాండ్‌ ‌లోపలికి వెళ్లే రెండు బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహించింది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌లు వరద నీటితో మునిగిపోయాయి. చాదర్‌ఘాట్‌ ‌లోయర్‌ ‌బ్రిడ్జి పైనుంచి మూసీ వరద ప్రవహిస్తున్నది. ముసారంబాగ్‌ ‌బ్రిడ్జి పైనుంచి 10 అడుగుల ఎత్తులో వరద పారుతున్నది. మూసీ చుట్టుపక్కల కాలనీలు, బస్తీల్లోకి వరద ముంచెత్తింది.భారీ వర్షాలతో హైదరాబాద్‌ ‌నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్‌ ‌బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 ఫీట్ల ఎత్తుతో పొంగిపొర్లుతోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మూసీ వరద తాకిడికి పలు ప్రాంతాల్లో గుడులు కూడా మునిగిపోయాయి. పురానాపూల్‌ ‌దగ్గర ఓ శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. వాళ్లు తమను ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా, జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది వారికి అల్పాహారం అందించారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎంజీబీఎస్‌ ‌బస్టాండ్‌కు వెళ్లే రెండు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో ఆ బస్టాండును అధికారులు తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు చాదర్‌ఘాట్‌ ‌వద్ద చిన్నవంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఆ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపేశారు. దాంతో పెద్ద వంతెన పైనుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఫలితంగా చాదర్‌ఘాట్‌ ‌పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. మరోవైపు మూసారాంబాగ్‌ ‌వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దాంతో అంబర్‌పేట్‌ ‌నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ ‌వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు మూసేశారు. మూసారాంబాగ్‌ ‌పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో వరద నీటిలో కొత్త వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. మూసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో దీంతో హైదరాబాద్‌ ‌నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రెవెన్యూ, హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.ఎంజీబీఎస్‌కు చేరుకొని పరిస్థితిని సక్షించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.హైదరాబాద్‌లోని జంట జలశయాలు హిమాయత్‌ ‌సాగర్‌, ఉస్మాన్‌ ‌సాగర్‌ ‌గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నగరంలోని మహత్మాగాంధీ బస్సు స్టేషన్‌కు వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌శనివారం  మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి హైడ్రా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రిటర్నింగ్‌ ‌వాల్‌ ‌పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని చెప్పుకొచ్చారు. ఎంజీబీఎస్‌లో డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని రంగనాథ్‌ ‌తెలిపారు. ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో వరద పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. మూసీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ అ‌ప్రమత్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *