– జాతీయ రహదారిపై కొనసాగుతున్న ట్రాఫిక్ జామ్
– కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
– ఐదుగురిని రక్షించిన సహాయక సిబ్బంది
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో జంట జలాశయాలకు పెద్ద ఎత్తున నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి మూసీ నదిలోకి వదిలారు. ఫలితంగా మూసారంబాగ్ వంతెన మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో వంతెనను మూసివేశారు. వంతెన పిల్లర్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి దెబ్బతినడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. మానేరు వరదలో చిక్కుకున్న ఐదుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. కామారెడ్డి జిల్లాలో ఇంకా జనజీవన స్తంభన ఇంకా కొనసాగుతూనే వుంది. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి పెరిగి మొదటి ప్రమాద హెచ్చకి స్థాయికి చేరుకుంది.
హైదరాబాద్/కామారెడ్డి/రాజన్న సిరిసిల్ల/పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. ఎగువ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఇవి పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 4100 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. కాగా, మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిని మూసివేశారు. వరద ధాటికి బ్రిడ్జ్ పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంబర్‌పేట్, దిల్‌షుక్‌నగర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మంచిరేవుల వద్ద కూడా మూసీ ఉధృతితో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డును మూసి వేశారు. దీంతో ఈ ప్రాంతంలో వహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. అప్రమత్తమైన అధికారులు నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డును మూసివేశారు. సర్వీస్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్‌ను మూసివేడంతో మంచిరేవుల నార్సింగి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి 4,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1789.45 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా హిమాయత్‌సాగర్ జలాశయానికి 800 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండటంతో 3 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. కాగా, ప్రస్తుతం 1762 అడుగులు నీటిమట్టం ఉన్నది.
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని 44వ నంబరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ శుక్రవారం కూడా కొనసాగింది. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు మెల్లగా కదిలేలా చర్యలు చేపట్టారు. రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సుమారు గంటకు పైగా ఈ పరిస్థితి నెలకొంది. సదాశివనగర్ మండలం నుంచి భిక్కనూర్ టోల్‌గేట్ వరకు సుమారు 15 కిలోటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం, గురువారం కురిసిన వర్షాలకు టెక్రియాల్, సారంపల్లి వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. మరోచోట రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురువారం రాత్రి కూడా వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోవడంతో పరిస్థితిని ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. త్వరగా రహదారులకు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే కామారెడ్డి జిల్లాను భారీ వర్షం కకావికలం చేసింది. దీనినుంచి ఇప్పట్లో తేరుకునేలా లేదు. కామారెడ్డి పట్టణంతోపాటు రాజంపేట, భిక్కనూరు, దోమకొండ మండలాల్లో జనజీవనం స్తంభించింది. రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో 24 గంటల్లో అత్యధికంగా 44 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో 20 సెం.మీ. మేర వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలోని పెద్దచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలోని పైవంతెన మీది నుంచి నీరు ప్రవహించింది. సిరిసిల్ల మార్గంతోపాటు నిజాంసాగర్ మార్గంలోనూ రోడ్లు ధ్వంసమవడంతో పట్టణానికి మూడు వైపులా రాకపోకలకు ఆటంకం కలిగింది. పెద్దచెరువు అలుగుతో కిందనున్న జీఆర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. భిక్కనూరు- తలమడ్ల స్టేషన్ల మధ్యలో రామేశ్వరపల్లి గ్రామశివారులో వరద ఉద్ధృతికి రైల్వేకట్ట తెగింది. రైల్వేట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయాయి. దీంతో నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో రైళ్లు నిలిచాయి. జాతీయ రహదారి 44పై భిక్కనూరు టోల్‌గేట్ వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవాహం చేరడంతో పాక్షికంగా రోడ్డు దెబ్బతింది. భిక్కనూరు వద్ద రహదారిపై 20 కి..కు పైగా వాహనాలు గంటల తరబడి నిలిచాయి. అధికారులు వారికి ఆహారంతోపాటు- తాగునీరు సమకూర్చారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద నిజామాబాద్ వెళ్లే మార్గంలో గురువారం జాతీయ రహదారి కుంగిపోయింది. టేక్రియాల్ వద్ద పెద్దచెరువు ప్రవాహంతో ఒకవైపు మొత్తం జాతీయ రహదారి కుంగింది. జిల్లావ్యాప్తంగా 130 రోడ్లు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేట, వాడి గ్రామాల్లో చెరువు కట్టలు తెగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం గ్రామ ప్రజలను వరద నీరు చుట్టుముట్టింది. రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి ఒడ్డున ఉన్న ఆశ్రమంలోకి నీరు చేరడంతో సాధువుల్ని, పశువుల్ని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు.
కాళేశ్వరం వద్ద పోటెత్తిన గోదావరి
భారీ వర్షాలకు మరోసారి గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వరద మొదటి ప్రమాదకర హెచ్చరిక స్థాయిని దాటింది. కాళేశ్వరంలో జ్ఞాన సరస్వతి, పుష్కర ఘాట్ల మెట్ల పైనుంచి వరద ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక సమీప గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. మహదేవపూర్ మండలంలో పంట భూముల్లోకి నీరు చేరింది. అన్నారం, చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, బలిజాపూర్ గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంగడంతో వందల ఎకరాల పత్తి పంట నీట మునిగింది. రెండోసారి పత్తి పంటనష్టంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 9,71,880 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో 85 గేట్లు ఎత్తి 9,71,880 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఐదుగురిని రక్షించిన సహాయక సిబ్బంది
భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న తన కుమారుడు జంగం స్వామి కోసం తల్లి లక్ష్మి 30 గంటల పాటు ఎదురుచూసింది. ఆమె ఆందోళన గుర్తించిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన స్వామి భారీ వర్షాల కారణంగా సుడిగుండం వరద నీటిలో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి భయంతో ఆందోళన చెందింది. అధికారుల కాళ్ల మీద పడుతూ తన కొడుకుని రక్షించాలని వేడుకుంది. అయితే స్వామితో పాటు మరో నలుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసినాప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే 30 గంటలు గడిచిపోయాయి. వారు మానేరుపైనే ఉన్నారు. వారు తిరిగి వస్తారా అనే సందేహం అందరిలో మొదలయ్యింది. చివరకు రెస్క్యూ బృందం కొన్ని గంటలు శ్రమించి.స్వామితో పాటు మానేరులో చిక్కుకుపోయిన వారిని రక్షించింది. దీంతో ఆ తల్లి 30 గంటల నిరీక్షణకు తెరపడింది. కొడుకు తిరిగి రావడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనను రక్షించిన రెస్క్యూ బృందంకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇది రెండవ జీవితమని స్వామి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





