కారుతో ఢీకొట్టించి హత్య

– రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే యత్నం
– ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ మహిళ కట్టకున్న భర్తనే కడతేర్చింది. పక్కా ప్లాన్‌ ప్రకారం ప్రియుడితో కలిసి కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే యత్నం చేసింది. చివరకు కుటుంబ సభ్యులకు అనుమానం రావడంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి అసలు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆమెతోపాటు మరో ఇద్దరు నిందితులను ఆరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38)కి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పల్లెర్లలోనే ఉంటూ భువనగిరిలోని ఓ ట్రాక్టర్‌ షోరూంలో మేనేజర్‌గా స్వామి పనిచేస్తుండగా భార్య స్వాతి కూడా ఇదే షోరూమ్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన సాయికుమార్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య స్వాతి ప్రియుడు సాయికుమార్‌తో కలిసి పథకం రచించింది. స్నేహితుడు వీరబాబుతో కలిసి స్వామి సోమవారం భువనగిరికి వెళ్లగా భర్తని అడ్డు తొలగించుకునేందుకు ఇదే అదనుగా భావించి తన తమ్ముడు మహేష్‌, ప్రియుడు సాయికుమార్‌తో కలిసి స్వామి లొకేషన్‌ను ఫోన్‌ ద్వారా ట్రాక్‌ చేసింది. భువనగిరి నుంచి పల్లెర్లకు వస్తున్న విషయాన్ని సాయికుమార్‌కు స్వాతి చేరవేసింది. మహేష్‌, సాయికుమార్‌ కలిసి భువనగిరిలో ఓ కారు అద్దెకు తీసుకొని బయలుదేరారు. మోటకొండూరు మండలం కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి దాటగానే స్వామి బైక్‌ను సాయికుమార్‌ కారుతో బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. స్వామి మృతిచెందగా బైక్‌ వెనక కూర్చున్న వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వీరబాబును చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్‌కు తరలించి రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్నారు. స్వామి మృతిపై తమకు అనుమానం ఉందని, స్వాతి తరపు వారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వాతిని, మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిరది. కుటుంబ సభ్యలతోపాటు స్వాతి కూడా ఏమీ తెలియనట్లుగా ఎవరికీ అనుమానం రాకుండా రోదించిందని స్థానికులు తెలిపారు. మృతుడి బాబాయి అయిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మోటకొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాతి కాల్‌ డేటాతో వీరి బాగోతం మొత్తం బట్టబయలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *