– భార్య, కుమారుడి మృతి
– ప్రాణాపాయ స్థితిలో కూతురు ప్రణీత
ఆమనగల్లు, ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధి పులిగోనిపల్లి తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న సభావట్ రాందాస్ అనే వ్యక్తి తన భార్య కవిత(29), కుమారుడు హర్షవర్ధన్(5), కూతురు ప్రణీత(9)లపై రోకలితో దాడి చేశాడు. తలపై బలంగా మోదడంతో కవిత అక్కడికక్కడే మృతిచెందింది. పక్కనే ఉన్న హర్షవర్ధన్(హర్షిత్), కుమార్తె ప్రణీతలపై దాడి చేయగా హర్షిత్ మృతిచెందగా ప్రణీత ప్రాణాపాయ స్థితిలో ఉంది. దీనికి సంబంధించి పులిగోనిపల్లి తండా గిరిజనులు, మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాందాస్‌కు భార్య కవితతోపాటు ముగ్గురు కూతుర్లు పవిత్ర, పావని, ప్రణీత, కుమారుడు హర్షవర్ధన్ ఉన్నారు. పదేళ్లుగా అతను మద్యానికి బానిసై తరచూ భార్యాపిల్లలతో గొడవపడేవాడు. కుటుంబ పెద్దలు, ఇరుగుపొరుగువారు కాపురం మంచిగా చేసుకోవాలని హితబోధ చేసేవారు. గతంలో పోలీస్ స్టేషన్‌లో భర్తపై కవిత ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినా రాందాస్ ప్రవర్తన మార్చుకోకుండా వేధిస్తుండేవాడని, చివరకు భార్యాపిల్లలను అంతమొందించినట్లు వారు తెలిపారు. ఆమనగల్లు సూర్యలక్ష్మి కాటన్ మిల్లులో పనిచేస్తున్న రాందాస్ సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. భార్యతో గొడవపడగా తెల్లవారుజామున చూసేసరికి భార్య, కుమారుడు చనిపోయి ఉన్నారని ఇరుగుపొరుగు వారు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న ప్రణీతను పోలీసుల సహకారంతో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించగా ఆమె చికిత్స పొందుతోంది. సంఘటన స్థలాన్ని క్లూస్ టీమ్, ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, జానకిరామ్ రెడ్డి, గంగాధర్ ఎస్సై సీతారాం రెడ్డి పరిశీలించారు. హత్యకు రాందాస్ వాడిన రోకలి, అక్కడే ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హత్యలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని ఏసీపి తెలిపారు. ఏసీపి జానకి రెడ్డి తన ప్యాకెట్ మనీ రూ.5 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



