– కాంగ్రెస్ నేతను హతమార్చిన సమీప బంధువు
నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోనే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు హత్యకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామస్థాయి రాజకీయాల్లో పెరిగిన విభేదాలు చివరకు రక్తపాతం వరకు వెళ్లినట్లు సమాచారం. ఇందల్వాయి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఇమ్మడి గోపిపై ఆయనకు బంధువైన సతీశ్ దాడి చేశాడు. ముందుగా కారుతో ఢీకొని అనంతరం కత్తితో దాడి చేసి గోపిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం సతీశ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సతీశ్.. గోపికి వరుసకు మేనల్లుడు. ఒకే కుటుంబానికి చెందిన వారైనా గ్రామ రాజకీయాల్లో ఏర్పడిన విభేదాలు వారి మధ్య తీవ్ర శత్రుత్వంగా మారాయి. గ్రామంలో రాజకీయంగా ఇద్దరూ ప్రభావం చూపే స్థాయిలో ఉండటంతో కాలక్రమేణా విభేదాలు పెరిగాయి. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గౌరవరం గ్రామంలో సర్పంచ్‌గా గోపి భార్య విజయం సాధించారు. సతీశ్ భార్య కూడా సర్పంచ్ పదవికి పోటీ చేశారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య రాజకీయంగా తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. గోపి హత్యతో గౌరవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే గ్రామానికి పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భద్రతను పెంచారు. గోపి మరణంతో గ్రామ ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాతికి గురయ్యారు. హత్యకు అసలు కారణాలు ఏమిటి, ప్రణాళికతోనే గోపిని హత్య చేశాడా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




