– అసలు నిజాన్ని వెలికి తీసిన పోలీసులు
– గద్వాల జిల్లాలో మాజీ సర్పంచ్ హత్య కేసు ఛేదన
గద్వాల, ప్రజాతంత్ర, నవంబర్ 27: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ మాజీ సర్పంచ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇది హత్యగా ధ్రువీకరించారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం మాజీ సర్పంచ్‌ను మట్టుపెట్టారని గుర్తించారు. బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మాజీ సర్పంచి ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అంతా రోడ్డు ప్రమాదమని భావించారు. కుటుంబ సభ్యులు మాత్రం ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా అనుమానించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి వారం రోజుల్లో కేసును ఛేదించారు. పైకి కనిపిస్తున్నట్లు అది ప్రమాదం కాదని.. రూ.25 లక్షలు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని, నెల రోజులు రెక్కీ నిర్వహించి.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా నిర్ధరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నందిన్నె మాజీ సర్పంచి చిన్నభీమ రాయుడిని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించడం జిల్లాలో సంచలనం రేపింది. కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు డియా సమావేశంలో వెల్లడించారు. ఈనెల 21న నందిన్నె మాజీ సర్పంచి చిన్నభీమ రాయుడు ద్విచక్ర వాహనంపై గద్వాల నుంచి సొంతూరు నందిన్నెకు బయల్దేరారు. వెనుక నుంచి వచ్చిన బొలెరో ఆయన్ను బలంగా ఢీకొట్టింది. కొద్ది దూరం వాహనం సహా లాక్కెళ్లింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బొలెరో ముందు భాగంలో బైక్ ఇరుక్కు పోయింది. దీంతో డ్రైవర్ సహా.. అందులో ఉన్నవారంతా పరారయ్యారు. ఈ ఘటనను తొలుత ప్రమాదంగా భావించారు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదం జరిగిన తీరు చూసి ఉద్దేశ్య పూర్వకంగానే ఢీ కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారం రోజుల్లో ప్రమాదం వెనక మిస్టరీని ఛేదించారు. రూ.25లక్షల సుపారీ కుదుర్చుకుని పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధరించారు. నందిన్నె గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అలియాస్ కురువ వీరన్నకు.. మృతుడు చిన్నభీమ రాయుడికి మధ్య భూ వివాదాలు, రాజకీయ కక్షలు ఉన్నాయి. వీరన్న రైస్ మిల్లులో అక్రమాలపై అధికారులు సోదాలు నిర్వహించి కేసు నమోదు చేశారు. దీంతో చిన్నభీమ రాయుడిపై వీరన్న మరింత కక్ష పెంచుకున్నాడు. ఆయన్ను హత్య చేయించేందుకు కర్నూలుకు చెందిన ఈశ్వరయ్య గౌడ్‌తో రూ.25 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. హత్యచేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తే నేరం తమపైకి రాకుండా ఉంటుందని ప్రణాళిక రచించాడు. నెలరోజులు రెక్కీ నిర్వహించారు. నాలుగుసార్లు హత్యాయత్నం చేసినా.. పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నెల 21న అదునుచూసి జాంపల్లి బస్టాండ్‌కు సపంలో చిన్నభీమ రాయుడు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. చనిపోయాడని నిర్ధరించుకునే వరకూ బైక్ సహా ఈడ్చుకెళ్లారు. బైక్ ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ కేసులో మిల్లు వీరన్న సహా 10మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




