మున్సిపల్ ఎన్నికలు – రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్రంలో  జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం తో ముగిసింది. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూడలేం. ఇవి రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలు గా గుర్తించాలి. ఈ ఎన్నికలు సాధారంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయని భావించినా  రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల వ్యూహాలు, ప్రజల అంచనాలు – ఇవన్నీ ఒకే వేదికపై తేల్చే రాజకీయ ప్రయోగమే ఈ ఎన్నికలు. తెలంగాణలో గ్రామీణ రాజకీయాల కంటే, ఇటీవలి కాలంలో పట్టణ రాజకీయాల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. కొత్త మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో పాటు పట్టణ జనాభా కూడా వేగంగా పెరుగుతోంది. పట్టణ మధ్యతరగతి, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగం – వీరంతా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే కీలక వర్గాలుగా మారారు. పట్టణ సమస్యలు ఇప్పుడు రాజకీయ ఎజెండాలో ముందువరుసలో ఉన్నాయి. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ప్రాపర్టీ ట్యాక్స్, భవన అనుమతులు, అక్రమ నిర్మాణాలు, చెత్త నిర్వహణ వంటి అంశాలే వోటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకం. శాసనసభ ఎన్నికల్లో వొచ్చిన విజయం తర్వాత, పట్టణ ప్రజల నుంచి అదే స్థాయిలో మద్దతు కొనసాగుతుందా లేదా అన్నదే అసలు పరీక్ష.ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పట్టణ వర్గాల్లో ఆశలు కూడా ఉన్నాయి, అసంతృప్తి కూడా ఉంది. ముఖ్యంగా విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ సమస్యలు, రహదారి పనుల ఆలస్యం, మున్సిపల్ సేవల నాణ్యత వంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా నిలవనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయనే భావన పట్టణ వర్గాల్లో కొంతవరకు ఉంది. దీనిని అధిగమించేందుకు పట్టణ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన  అవసరం ఉంది.

మున్సిపల్ ఎన్నికలు భారత రాష్ట్ర సమితి పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఈ పార్టీ, పట్టణ పాలనలో గట్టి పట్టును కలిగి ఉంది. చాలా మున్సిపాలిటీలలో స్థానిక నాయకత్వం ఇప్పటికీ బలంగా ఉంది. పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో చేపట్టిన పట్టణాభివృద్ధి కార్యక్రమాలు – రోడ్లు, ఫ్లైఓవర్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు – తమ పాలన విజయాలుగా బీఆర్ఎస్ ప్రచారం లో ఉపయోగించుకుంది అయితే, శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయానంతరం పార్టీ శ్రేణుల్లో ఏర్పడిన నిరాశ, కొంతమంది నాయకుల మౌన నిర్లిప్తత, అంతర్గత విభేదాలు మున్సిపల్ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను పట్టణాల్లో తన పునాది బలపర్చుకునే అవకాశంగా చూస్తోంది. ముఖ్యంగా యువ వోటర్లు, మధ్యతరగతి వర్గాలు, జాతీయ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ నాయకత్వం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకున్న  బీజేపీ, కాంగ్రెస్–బీఆర్ఎస్ రెండింటినీ సమానంగా విమర్శిస్తూ “ప్రత్యామ్నాయం”గా నిలవాలని ప్రయత్నిస్తోంది.

పట్టణ రాజకీయాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC). హైదరాబాద్ నగరం మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల మున్సిపాలిటీలు కూడా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ రంగం, రియల్ ఎస్టేట్, మెట్రో విస్తరణ, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు ప్రధాన అంశాలు. జి హెచ్ ఎమ్ సీ  పరిధిలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వొస్తాయో, అదే ధోరణి మిగతా పట్టణాలపైనా కొంతవరకు ప్రతిబింబించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థులు, వార్డు స్థాయి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? సమస్యలను పరిష్కరించగలిగారా? అన్న ప్రశ్నలే వోటర్లను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయనున్నాయి. అందుకే మూడు ప్రధాన పార్టీలు కూడా “బలమైన స్థానిక నాయకత్వం ” కోసం తీవ్రంగా ప్రయత్నించాయి . టికెట్ల పంపిణీ ప్రక్రియలో అంతర్గత అసంతృప్తి పెరిగితే, తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్రుల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంది.

ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల దిశను నిర్దేశించే స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పట్టణ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న ఆశలు, అసంతృప్తి – ఈ రెండింటి మధ్య జరిగే రాజకీయ పోరాటమే ఫలితాలను నిర్ణయించనుంది. ఒకవైపు పాలనపై ప్రజల అనుభవం, మరోవైపు ప్రతిపక్షాల ప్రచార వ్యూహం, స్థానిక నాయకత్వం – ఈ మూడు అంశాల సమ్మేళనమే ఈ ఎన్నికల అసలైన ఫలితం. అందువల్ల, ఈ మున్సిపల్ ఎన్నికలను కేవలం స్థానిక సంస్థల పోరాటంగా కాకుండా, తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ప్రజలు ఇచ్చే కీలక సంకేతంగా చూడాల్సి ఉంటుంది – అదే ఈ ఎన్నికల అసలైన రాజకీయ ప్రాముఖ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *