పోరాటాల పురిటిగడ్డలో పుర ఎన్నికలు రసవత్తరం

– ఐదు మున్సిపాలిటీలు తమవేనంటూ కాంగ్రెస్ ధీమా
– ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలు

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట గడ్డకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది నైజాంపై పోరాడి ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పుటిగడ్డ. అనంతరం జరిగిన మహత్తరమైన రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించింది. అనేకమంది రాజకీయ యోధులను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ నేల అప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్‌గానే నిలిచిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీ¾ఆర్ ప్రభంజనాన్ని కాదని అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్‌కు అందించింది. అవే ఫలితాలు రేపటి మున్సిపల్ ఎన్నికల్లో పునరావృత్తం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రజల రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా మారనున్నాయి. సూర్యాపేట మునిసిపాలిటీ 1952లో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పడింది. అనంతరం 1984లో గ్రేడ్-2 1998న గ్రేడ్-1గా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఈ మున్సిపాలిటీ ప్రారంభంలో 1952లో 16 వార్డులతో ఏర్పడగా నేడు 9 గ్రామ పంచాయతీలను విలీనం చేసుకుని 48 వార్డులతో విస్తరించింది. మొత్తం ఓటర్లు 1,08,848మంది కాగా స్త్రీలు 56,664, పురుషులు 52,170, ఇతరులు 14 మంది ఉన్నారు. కోదాడ మున్సిపాలిటీ 2011లో ఏర్పడగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన అనంతరం 2014లో 30 వార్డులుగా, 2019లో 35 వార్డులకు విస్తరించింది. మొత్తం ఓటర్లు 58541 కాగా స్త్రీలు 30,484, పురుషులు 28,045, ఇతరులు 12 మంది ఉన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 28కాగా మొత్తం ఓటర్లు 29, 996, మ్రంది ఉన్నారు. వీరిలో స్త్త్రీలు 15,731, పురుషులు 14,257, ఇతరులు 8మంది ఉన్నారు. అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 15 కాగా మొత్తం ఓటర్లు 13746 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు 6,629మంది, పురుషులు 7,116, ఇతరులు ఒక్కరు ఉన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 15కాగా, మొత్తం ఓటర్లు 15వేలమంది. స్త్రీలు 7817, పురుషులు 7638 ఉన్నారు.

అభ్యర్థుల ప్రచార శైలి

కౌన్సిలర్‌ అభ్యర్థులు ప్రధానంగా పారిశుధ్య సమస్య, సిసి రోడ్ల నిర్మాణం, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను గడపగడపకూ అందజేస్తామంటూ ప్రజల్ని నమ్మబలికారు. బీఆరఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నదనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ బీజేపీ ప్రచారం సాగింది. అలాగే వామపక్ష పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన గొంతుకగా మున్సిపల్ కౌన్సిల్లో పనిచేస్తామంటూ ఇంటింట ప్రచారం చేశారు.

ప్రస్తుత ఎన్నికల సరళి 

ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డులకు 615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అత్యధికంగా 264 మంది, కోదాడ మున్సిపాలిటీలో 130, హుజూర్‌నగర్‌లో 111, తిరుమలగిరిలో 56, నేరేడుచర్లలో 54 మంది పోటీలో నిలిచారు. అభ్యర్థులు కరపత్రాలు, గోడపత్రికలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు.

ప్రలోభాలకు తెరలేపిన పార్టీలు

సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మందు, డబ్బు పంపకం జరిపే కార్యక్రమానికి తెర లేపారు. అన్ని మున్సిపాలిటీల్లో ఓటుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే హుజూర్‌నగర్ లో అన్ని పార్టీల అభ్యర్థులు అవగాహనకు వచ్చి ఓటు రేటును తగ్గించినట్లు సమాచారం.

ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు 

సూర్యాపేట మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీకి దూకుడుగా తమ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని పోలింగ్ కంటే ఐదు రోజుల ముందే ప్రకటించింది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన మొరిసెట్టి నివేదితను ప్రకటించడం పోటీని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ పరిణామం బీఆరఎస్, బీజేపీలను కలవరపరిచింది. ఈ పరిణామంతో మేల్కొన్న బీజేపీ వైశ్య సామాజిక వర్గానికే చెందిన పేద మహిళను తమ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్‌ఎస్ జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలుస్తున్నది.

అధికారం మార్పిడికి అవిశ్వాసాలు 

ఐదు మున్సిపాలిటీల్లో ఆయా కాలాల్లో ఏర్పడ్డ చైర్మన్‌ను తొలగించడానికి అసమ్మతివాదులు అవిశ్వాస తీర్మానా పెట్టి నెగ్గిన సందర్భాలే కనిపిస్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పటి పాలకవర్గాలపైన అవిశ్వాస తీర్మానాలకు ప్రయత్నించారు. కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. కానీ సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వీగిపోయింది. బీఆర్‌ఎస్ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి రాజకీయ చతురతే బీఆర్ఎస్‌ను అవిశ్వాసం నుంచి కాపాడింది.

దామన్న చరిష్మా

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చరిష్మాతో సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు ఆయన మరణానంతరం వారి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిల దన్నుతో ఈసారి ఎన్నికల బరిలో పోరాడుతున్నారు. ఎన్నికల్లో మరో రాష్ట్ర కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి పాత్ర కీలకంగా మారింది. వీరి ఐక్యత ఓటుగా మారి కాంగ్రెస్కు గెలుపును అందిస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద దిక్కుగా మారి రాజకీయాల్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తిరుమలగిరిలో కాంగ్రెస్‌లో వర్గపోరు బీఆరఎస్‌కి కలిసొచ్చే అంశంగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *