– చెమటోడ్చిన పార్టీల నేతలు
– సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారం
– బీజేపీ నుంచి రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర మంత్రులు
– బీఆర్ఎస్ లో అంతా తామే అయిన కేటీఆర్, హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అన్ని పార్టీల నేతలు చెమటోర్చారు. చివరి రోజు ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష నేతలు సుడిగాలి పర్యటనలు చేపట్టి ప్రచారంలో పైచేయి సాధించాలని చూశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ప్రచారంలో బిజీగా గడిపారు. ఆయాచోట్ల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపల్ కేంద్రాల్లో ప్రతిష్ఠాత్మక ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థులు పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తమదైన శైలిలో ప్రచారం చేపట్టారు. మరోవైపు అమలుకాని కాంగ్రెస్ హామీలను ఎండగడుతూ బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగారు. అన్ని పార్టీల వాళ్లు ర్యాలీలతో హోరెత్తించారు. గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా మహిళలకు బొట్టుపెట్టి తమ పార్టీ విధానాలను వివరిస్తూ ఓట్లు అడగడం విశేషం. బీఆర్ఎస్ అగ్రనేతలైన కేటీఆర్, హరీష్ రావు ప్రచారపర్వాన్ని తమ భుజాన వేసుకున్నారు. కారుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిస్తూ ముందుకు సాగారు. సీఎం రేవంత్ సహా మంత్రులు పలుచోట్ల ప్రచారంలో కనిపించారు. బీజేపీలో ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అధ్యక్షుడు రామచందర్‌రావు సహా ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేనంతగా బీజెపి కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. కార్నర్ మీటింగ్ లు నిర్వహించి ఓటర్లతో మమేకమయ్యారు. మహిళలు, యువతతో ముచ్చటించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రచార ర్యాలీల్లో పాల్గొని క్యాడ ర్లో జోష్ నింపారు. అన్ని పార్టీలు మున్సిపాలిటీల వారీగా ఇచ్చా ర్జిలను నియమించి పక్కా ప్రణాళికతో హోరెత్తించారు. సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సభలకు జనం నుంచి మంచి స్పందన కనిపించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్రెడ్డి పలు జిల్లాల్లోని మున్సిపాలిటీలను చుట్టేశారు. అలాగే మెజార్టీ మంత్రులు తమ నియోజకవర్గాల పరిధిలోని బల్దియాల్లోనే మకాం వేసి ఓట్లు అభ్యర్థించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం పలు మున్సిపాలిటీల్లో ప్రచారం సాగించారు. ప్రచారపర్వంలో బీజేపీ అభ్యర్థుల తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ పార్టీ ఎంపీలు అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డీకే అరుణ తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలను చుట్టేశారు. సంకల్ప యాత్రల పేరిట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ మహామహులు ప్రచారం సాగించారు.
ఓటు కోసం నేతల పాట్లు
నిజామాబాద్ : పోలింగ్‌కు ఒక్కరోజే సమయం ఉండడంతో ఓట్లు వేసే వారి గురించి అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణం వదిలి వెళ్లిన వారిని రప్పించేందుకు రంగంలోకి దిగారు. అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఇతర ప్రాంతాలకు ఎవరు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా పలువురు అభ్యర్థులు హామీలతోపాటు ఆఫర్లు ఇస్తున్నారు. పట్టణాల్లో ఓటర్లు వివిధ పనుల్లో బిజీగా ఉంటుండడంతో అభ్యర్థులు తమ అనుచరగణంతో కాలనీలోని పలువురి ఇళ్లకు తెల్లవారగానే వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ఆయా వార్డుల్లో ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల గుర్తులతో కూడిన కరపత్రాలను ఓటర్లకు అందిస్తూ తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి రీత్యా ఇతర పట్టణాలకు ప్రాంతాలకు వలస వెళ్లిన పట్టణవోటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తమ మద్దతుదారులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనే వివరాలను సేకరించి వారితో రోజుకు ఒకసారైన మాట్లాడుతూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వారి వద్దకు తమ సన్నిహితులను పంపి తమకు ఓటు వేసే విధంగా వ్యక్తిగతంగా ముఖముఖీగా మాట్లాడిస్తున్నారు. ముగ్గురు, నలుగురు, అంతకంటే ఎక్కువమంది ఓటర్లు ఉంటే ప్రత్యేక వాహనాలు సమకుర్చేందుకు సిద్ధవుతున్నారు. ఆలస్యం చేస్తే తమ పోటీదారులు వలస ఓటర్ల నుంచి ఎక్కడ మాట తీసుకుంటారోనని అప్రమత్తమవుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





