ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జులై 23 : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అందుకే ఉచిత ప్రయాణంతోపాటు వడ్డి లేని రుణాలు, రూ.500కే వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ కల్పిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. మహిళల విజయాలను జీర్ణించుకోలేక ఉచిత ప్రయాణాన్ని బీఆఎస్‌ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు 200 కోట్లు దాటిన సందర్భంగా సంబురాలను ములుగులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సాధారణ ప్రయాణికురాలిగా బస్సులో ములుగు బస్టాండ్‌కు చేరుకుని మహిళల ఉచిత బస్సు ప్రయాణ అనుభవాలు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు అభినందనలు తెలిపి మహిళా ప్రయాణికులకు స్వీట్లు తినిపించి సంబురాలు నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతం చేసిన ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ప్రయాణ భారం లేకండా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందనింటూ ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలను మహిళలు పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఉచిత ప్రయాణంతో రూ.6700 కోట్లు వారికి ఆదా అయిందని, ఆ మొత్తాన్ని ఆడబిడ్డల తరుపున ప్రభుత్వమే ఆర్టీసికి చెల్లించిందని చెప్పారు. ములుగులో ఆధునాతన బస్టాండ్‌ను నిర్మణాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం, చుట్టుపక్కల ప్రాంతాలకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నందున బస్సు సర్వీసులను పెంచాలని సూచించారు. మంత్రి తమతోపాటు ప్రయాణించి, ఆప్యాయంగా పలకరించడంతో మహిళా ప్రయాణికుల ఆనందానికి అవధులు లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *