ములుగు జిల్లా రద్దు కాదు .. ఆందోళన చెందొద్దు

– మంత్రి సీతక్క స్పష్టీకరణ

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ములుగు జిల్లా రద్దవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో నూతన జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని ఆక్షేపించారు. ఒక మండలం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలన్నది ప్రజల కోరిక అన్నారు. ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుంది.. అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉంటాయి.. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి అని ఆమె ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీసు సరిహద్దులు ఒకే లాగా ఉండాలి.. కానీ ఆ విధానాన్ని కేసీఆర్‌ అవలంబించలేదు.. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని తెలిపారు. అభివృద్ధిపరమైన సమీక్ష సమావేశాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. తాము జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన వాళ్లమని, ఈ జిల్లా ఏర్పాటు నచ్చని వాళ్లే రద్దవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తున్నదని, అలాంటప్పుడు జిల్లా రద్దు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుస్తుందని మంత్రి సీతక్క అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *