డిజిటల్‌ కార్డులతో బహుళ ప్రయోజనం!

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఏకీకృత కార్డు ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్డు ద్వారా మేలు జరుగనుంది. రేషన్‌, ఆరోగ్యం, పింఛన్‌.. అన్నింటికీ ఒకటే కార్డు ఉండాలన్న సంకల్పంతో ప్రక్రియను చేపట్టారు. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో కూడా ఉంటుంది. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కార్డుపై వారి ఫొటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రజల వివరాలు నమోదు కానున్నాయి. ప్రధానంగా ఆరోగ్య, ఆర్థిక వివరాలు నమోదు చేస్తారు. నాలుగు రాష్ట్రాల్లో  అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్‌కార్డు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కార్డులో ఏయే అంశాలు ఉండాలి.. ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్‌ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది.

ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. గత పది రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఐదారు సమావేశాలు నిర్వహించారు. అక్కడి వాటిలో మేల్కెన అంశాలను తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చినా కొంతమేర మార్పుచేర్పులు జరిగే అవకాశాలున్నాయి. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పైలట్‌ ప్రాజెక్టు సర్వేను ఈనెల 3న సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్డులో తొలుత రేషన్‌, మహాలక్ష్మి పథకాల లబ్దిదారులను అనుసంధానం చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకుపైగా రేషన్‌ కార్డులున్నాయి. తొలుత ఈ కార్డులు, అందులో లబ్దిదారుల్ని డిజిటల్‌ కార్డుల్లో చేరుస్తారు. కొత్తగా ఇచ్చే రేషన్‌ కార్డుల వివరాల్ని ఆ తర్వాత చేర్చనున్నట్లు సమాచారం. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలవుతోంది. వీరి వివరాల్ని కూడా డిజిటల్‌ కార్డులో తొలి దశలోనే అనుసంధానించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పింఛన్ల పథకాలు, లబ్దిదారుల్ని డిజిటల్‌ కార్డులో చేర్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్‌కు ఒకటి.. ఆరోగ్యానికి మరోటి.. ఇతర పథకాలకు ఇంకోటి..

ఇలా వేర్వేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్దిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డును తీసుకువస్తోంది. ఒకే రాష్ట్రం.. ఒకే కార్డు(వన్‌ స్టేట్‌. వన్‌ డిజిటల్‌ కార్డ్‌) విధానంతో ముందుకు వెళుతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ కన్వీనర్‌గా సీనియర్‌ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసింది. అధికారుల బృందం సెప్టెంబరు 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్రల్లో అధ్యయనం చేసి వచ్చి సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.  రేషన్‌ దుకాణానికి వెళ్లి అక్కడ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులోని క్యూఆర్‌ కార్డును స్కాన్‌ చేస్తే.. ఆ కుటుంబానికి రేషన్‌ కార్డు ఉందా? లేదా? ఉంటే కార్డు రకాన్ని బట్టి అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి.. వారికి ఎన్ని కిలోల బియ్యం, గోధుమలు, చక్కెర ఇవ్వాలి.. ఈ వివరాలన్ని తెలిసిపోతాయి. ఇదే కార్డుతో ఆసుపత్రికి వెళ్తే రాజీవ్‌ ఆర్యోగశ్రీకి అర్హులా లేదా.. తెలుస్తుంది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికీ ఈ కార్డు ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు ఉంటే.. ముగ్గురు మూడు ఆధార్‌ కార్డులు పట్టుకుని ప్రయాణించాలి. అదే ఈ కార్డులోని క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆ కుటుంబంలో ఉచిత ప్రయాణానికి అర్హుల్కెన వారి వివరాలన్నీ వస్తాయి. అదేవిధంగా భవిష్యత్‌లో ఏద్కెనా పథకం కోసం దరఖాస్తు చేయాల్సి వస్తే పదేపదే ఆధార్‌ సమర్పించడం వంటి వ్యయప్రయాసలు ఉండవని ఓ అధికారి తెలిపారు. డిజిటల్‌ కార్డులోని ఆ కుటుంబసభ్యుడి, సభ్యురాలి యూనిక్‌ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుందన్నారు. ఇది ఓ రకంగా బహుళ ప్రయోజనకారి కానుంది.
-మారుపాక గోవర్ధన్‌ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *