– రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం.
– రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రికార్డు
– లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలమంది యువతకు ఉపాధి
– రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: రాష్ట్ర అభివృద్ధి కోసం, జీడీపీ పెరుగుదల లక్ష్యంగా, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఒకేసారి రూ.60,799 కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందని, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందని తెలిపారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయన్నారు. రహదారుల నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు స్థాపించనున్నారని, ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుందనీ తెలిపారు. అబ్దుల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్కు నుంచి విజయవాడ వరకు ఉన్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 8 లేన్ల రహదారిగా విస్తరించనున్నామని తెలిపారు. ఇందులో ఆరు లేన్లు ప్రధాన రహదారి కాగా రెండు సర్వీసు రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రహదారి వెంట ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.10,400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు కేటాయించినట్లు, ఆరు లేన్ల రీజినల్ రింగ్ రోడ్డు అన్ని జిల్లాలను కలుపుతుందని వివరించారు. ఈ రహదారి నిర్మాణానికి 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం. సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్ల నిర్మాణం కోసం హామ్ పాజెక్టుకు రూ.11,399 కోట్లుతో కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇస్తామన్నారు. రూ.8,000 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు తుది దశకు చేరాయన్నారు. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రూ.20 వేల కోట్లతో నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందని óవెంకటరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో రహదారులపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. న భూతో న భవిష్యత్తు అన్న రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ రహదారులకు సంబంధించిన అంశాలపై సంబంధిత మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకురావడం మూలంగా రహదారుల విషయంలో గొప్ప ప్రగతి కనిపించిందని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





