ముచ్చట్ల పందిరి ‘యాది’

చెమ్మవారాల ఆనంద్

సామల సదాశివ ఓ జ్ఞాపకాల గని, ముచ్చట్ల పందిరి, నడుస్తున్న సాహిత్యచరిత్ర, మరపురాని హిందుస్తానీ గానకచేరి తడిమేతేచాలు శరపరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినేవాళ్ళని ముచ్చట్లతో ముగ్దుల్ని చేసే విశాలప్రపంచం ఆయనది. ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా ఎక్కడెక్కటి విషయాలో ఎప్పటెప్పటి సంగతులో జాలువారే ప్రవాహం అయన. ‘నేను రాసేవి విమర్శలు, చెప్పేవి చారిత్రక అంశాలు కావు, అవి ముచ్చట్లు’ అన్నారాయన. వాస్తవంగా సాహిత్యంలో కొన్నిరచనలు గ్రంధాలయాల్లో అట్లా మిగిలి పోతాయి. మరికొన్ని మట్టిలోపుట్టి ఆ మట్టిలోనే పెరిగి కాలాన్ని దాటి నిలిచిపోతాయి. అటువంటి రచయితల్లో తెలంగాణా స్వరం సామల సాదాశివ. ఆయన రాసిన వాక్యాలు సంగీతంలానూ ఉర్దూ సాహిత్యపరిమళంతోనూ మనసును నింపేస్తాయి. మెల్లగా మన జ్ఞాపకాలగదిలోకి వచ్చి కూర్చుంటాయి. పాత పుస్తకాల వాసనలా వుండి గమ్మత్తయిన అనుభవాన్ని కలిగిస్తాయి. అవి చిరకాలం నిలిచిపోయేవి.

‘కర్ణాటకసంగీతంలో బహుదారి అని ఒకరాగం వుంది నాది అదేదారి’ అంటారు సదాశివ. అన్నిదారులూ వచ్చి అందులో కలుస్తాయి అందుకే నన్ను అందరూ కలుస్తారు ఆచార్య లక్ష్మణమూర్తి, ఆచార్య సంపత్కుమార, మహెజబీన్, యాకూబ్, శివారెడ్డి, దేవిప్రియ ఇలా ఒకరేమిటి అందరు వస్తారు అందుకే నాది బహుదారి’ అన్నారు సదాశివ. “యాది” అనే పదం సాదాసీదాగా కనిపిస్తుంది. కానీ ఆ పదంలోనే ఒక ప్రపంచం ఉంది. “యాది” అంటే కేవలం జ్ఞాపకం కాదు. అది గడిచిన ఒకకాలం తిరిగి మన ముందుకొచ్చేక్షణం. సామల సదాశివ రాసిన లేదాచెప్పిన “యాది”లో స్వీయజీవితాన్ని మాత్రమే రాయలేదు. తాను బతికిన కాలాన్ని రాశాడు. అక్కడ గత కాలపు వాసన వుంది గతించిన కాలం ఉంది. ఆయన తన జీవితమంతా చదివిన పుస్తకాల వెలుగు ఉంది. మిత్రులతో కలిసి చేసిన చర్చల వేడి ఉంది.
సంగీతం, కవిత్వం, సంస్కృతి అన్నీ ఆయన జ్ఞాపక వృక్షం క్రింద చేరుకున్నాయి.

సామల సదాశివకు ప్రతి పుస్తకం ఒక జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం ఒక కథ. నిజాం కాలపు తెలంగాణలో తెలుగు, ఉర్దూ, ఫార్సీ భాషలు ఒకే వీధిలో ఒకేసారి నడిచిన రోజులు ఉన్నాయి. ఆ భాషల మాధుర్యాన్ని సామల  సదాశివ తనలోదాచుకున్నాడు.  అందుకే ఆయన వ్యాసాలు చదువుతుంటే మనకు బహుభాషా సంస్కృతి వినిపిస్తుంది. సదాశివ తన రచనలకు గొప్ప సందర్భాలను సంఘటనలను వెతకలేదు. ఒక మిత్రుని జ్ఞాపకం ఒక పుస్తకం దొరికిన ఆనందం ఒక గురువు మాట ఆయన చేతిలో సాహిత్యంగా మారిపోయాయి. అందుకే “యాది” చదివినప్పుడు ఇది ఆ రచయిత జ్ఞాపకం కాదు, మన అందరి అనుభవమే కదా అనిపిస్తుంది. సదాశివ “యాది” తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది. అందులో గ్రామాల మట్టివాసన గత కాలపు మానవ సంబంధాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆయన వాక్యాల్లో ఒక ప్రశాంతమైన సంగీతం వినిపిస్తుంది. అది తెలంగాణ నేల స్వరం. భాష బరువైన అలంకారాలతో ఉండదు. చాలా సాదాసీదాగావుండి ఆ సరళతలోనే కవిత్వం దాగి ఉంటుంది. ఆయన వాక్యాలు ఒక పాత వీధిలో నడిచినట్లు మెల్లగా ముందుకు తీసుకెళ్తాయి.

సామల సదాశివ ఇప్పటి కొమరం భీం జిల్లా, దహేగావ్ మండలం తెలుగుపల్లెలో 1928, మే 11 న జన్మించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసినవాడాయన. నిజానికి సామల సదాశివ పేరు అనగానే ‘మలయమారుతాలు’, ‘సంగీత శిఖరాలు’, ‘యాది’ గుర్తొస్తాయి. అంజద్, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితాసామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడా గుర్తుకొస్తాయి. మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదము) వంటి రచనలలో మనకు తెలియని ఎన్నో కొత్తవిషయాలు యాదికి వస్తాయి. సదాశివకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, పార్సీ,  మరాఠీ భాషల్లో పరిచయం మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో సదాశివ వ్యాసాలు అనేక ఏళ్ళు ప్రచురించబడ్డాయి.

‘మలయ మారుతాల్లో సదాశివ మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని మేటి కళాకారుల్నీ, వారి గొప్పదనాన్ని ఆత్మాభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరిస్తాడు.

ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు.సామల సదాశివ జీవితాన్ని దగ్గరగా చూసినప్పుడు సంస్కృతిపట్ల మమకారం, భాషల సంగమంపై ఆసక్తి, జ్ఞాపకాలలో దాగి ఉన్న చరిత్రను వెలికి తీయాలన్న తపన కనిపిస్తాయి. ‘జ్ఞాపకాలను రాయండి. జ్ఞాపకాలను నిలుపుకోండి. ఎందుకంటే జ్ఞాపకాలే సంస్కృతికి నిజమైన గ్రంథాలయం’ అన్నారాయన. ఆయన జీవితం సాహిత్యంపై తెలంగాణా సాహితీ మూర్తులు పేర ఒక డాక్యుమెంటరీ  యు ట్యూబ్ లో వుంది. దాంట్లో ఆయన్ని చూడొచ్చు వినొచ్చు. చాలావరకు అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *