MSME: ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సాయం అందించండి

– కేంద్ర మంత్రికి మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, ఎంపీ మల్లు రవి వినతి

న్యూదిల్లీ, ఆగస్టు 6: మధిర (Madhira) నియోజకవర్గంలో రెండు ఇండస్ట్రియల్‌ పార్కుల (industrial parks) అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందించాలని దిల్లీలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి జితన్‌రామ్‌ మాంరిaని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపి రవిలు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని బుధవారం కలిసి ఈమేరకు లేఖను అందజేశారు. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రెమిడిచర్లల్లో రెండు కొత్త ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రికి వివరించారు. ఎంఎస్‌ఎంఈ రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందన్నారు. 85 ఎకరాలు, 60 ఎకరాల్లో ఈ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వారు వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌)కు సమీపంలో ఉండటంతో వీటి భౌగోళిక స్థానం వ్యూహాత్మకంగా ఉందని, సమీప పట్టణాలు, రైల్వే నెట్‌వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందని తెలిపారు. వీటి అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి జరిగి కనీసం ఐదు వేల ప్రత్యక్ష, 15వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. ఎంఎస్‌ఎంఈ-సీడీపీ పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఎంఎస్‌ఎంఈ-సీడీపీ పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్‌ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్‌ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *