- నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయంపై పారదర్శకత
– సామాన్య ప్రజలు తెలుసుకోనే అవకాశం
హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు) తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి అనే పోర్టల్ ప్రవేశ పెట్టింది. ఎంపీలకు అందచేస్తున్న ‘ఎంపీలాడ్’ నిధుల వినియోగంపై మరింత పారదర్శకత ఉండేందుకుగాను భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-సాక్షి నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ‘ఎంపీలాడ్’ పై జోనల్ శిక్షణ కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ గణాంక, ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ఈ వర్క్ షాప్‌లో, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిలాడ్స్ పథకానికి సంబంధించిన ఇ- సాక్షి పోర్టల్ అన్ని వివరాలను, అధికారులకు ప్రత్యేక్ష శిక్షణ తెలియచేసారు. ‘ఎంపీలాడ్’ కింద మంజూరు చేసిన పనులు, వాటి పురోగతి, నిధుల వ్యయం తదితర అంశాలను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) ద్వారా మ్యాపింగ్ చేయడం, తద్వారా సంబంధిత అధికారులు డిజిటల్ ప్రక్రియలను మరింత మెరుగ్గా అవగాహన చేసుకోవడంతోపాటు, సందేహాలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందనిఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రణాళికా శాఖ డైరక్టరు రూఫస్ దత్తం తెలిపారు. ఈ వర్క్ షాప్ కు గణాంకాలు, ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ పూజాసింగ్ మండోల్, డిప్యూటీ డైరక్టర్ జనరల్ జోసెఫ్ లు హాజరై శిక్షణను అందచేశారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ అధికారులు, రాష్ట్ర ప్రణాళికా శాఖ అధికారులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





