– లోక్‌సభలో ఎంపీ కావ్య ప్రస్తావన
కాజిపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 5: వరంగల్ జిల్లాలో రైతుల భూ రికార్డులను డిజిటలైజేషన్ చేసి బ్లాక్ చైన్ ఆధారంగా రూపొందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీని వల్ల రైతులు మోసపోకుండా, సబ్సిడీలు నేరుగా అర్హులైన వారికి అందుతాయని వివరించారు. తెలంగాణలో ఏవైనా పైలట్ ప్రాజెక్టులు ఉన్నాయా? బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎప్పుడు అమలు చేస్తారు? ప్రశ్నలను కేంద్రాన్ని అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాం ప్రస్తుతం అమలులో ఉందని తెలిపారు. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా లేదని, ఎప్పుడు అమలు చేస్తారో ప్రస్తుతం చెప్పలేమని పేర్కొన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ విధానంతో భూ రికార్డులను ఎవరూ నకిలీ చేయలేరని, ఎటువంటి మోసాలు లేకుండా రైతులకు సబ్సిడీలు నేరుగా అందుతాయని, రైతులకు అందించే ప్రభుత్వ పథకాలు సజావుగా అమలవుతాయని కావ్య స్పష్టం చేశారు. రైతులకు ఉపయోగపడే ఈ ఆధునిక టెక్నాలజీ అమలుపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోరారు.




