కల్తీ డీజిలే కారణంగా నిర్ధారించిన అధికారులు
ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌నే పెట్రోల్ బంకు నిర్వాహకులు బురిడీ కొట్టించిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రత్లంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గం గుండా బయల్దేరారు. దోసిగావ్ అనే ప్రాంతంలోని శక్తి ఫ్యూయల్ స్టేషన్‌లో కాన్వాయ్‌లోని 19 వాహనాలకు సిబ్బంది డీజిల్ కొట్టించారు. కొంత దూరం వెళ్లాక వాహనాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ డౌన్ అయ్యాయి. వాహనాలన్నీ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిరది. దీంతో సిబ్బంది వాహనాలను తోసుకుంటూ రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆపారు. ఎందుకు ఆగిపోయాయో తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి డీజిల్ ట్యాంకు మూతలు తీసి చూడగా వాటిల్లో నీళ్లు కనిపించాయి. వాహనాల్లోని డీజిల్‌ను బయటకు తీయగా సగానికి సగం నీరు కలిపినట్లు గమనించారు. కాన్వాయ్ ధికారులు వెంటనే పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ డీజిల్ పోయించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదేవిధమైన ఫిర్యాదులు చేయడంతో సివిల్ సప్లయిస్ అధికారులు రంగంలోకి దిగారు. బంక్‌ను తనిఖీ చేసి కల్తీని నిర్ధారించి సీజ్ చేశారు. సీఎం ప్రయాణం కోసం ఇండోర్ నుంచి వాహన శ్రేణిని రప్పించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.





