తీగ లాగితే క‌దులుతున్న డొంక‌

– ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాలు

– 1% రుసుము చెల్లించినా పూర్తయిన రిజిస్ట్రేషన్లు
– నిద్రపోయిన సాఫ్ట్‌వేర్‌, అధికారులు
పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాలతో మోసాలు
– తహసీల్దార్లు/జాయింట్ సబ్ రిజిస్టార్ల పాత్రపై అనుమానాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి14 : ధరణి పోర్టల్‌ ‌ప్రారంభం నుంచి ఎన్ని లావాదేవీల్లో ఇలాంటి పొరపాట్లు జరిగి ఉంటాయనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.వందల కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో మాత్రం రుసుం మొత్తంలో నామమాత్రంగా 1శాతం చెల్లించినా లావాదేవీలు పూర్తయ్యాయి. సాప్ట్‌వేర్‌లో లోపాలు ఉంటే… దస్త్రాలను ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన తహసీల్దారులు/సంయుక్త సబ్‌ ‌రిజిస్ట్రార్లు మిన్నకున్నారు. 2020లో ప్రైవేటు సంస్థ ద్వారా ప్రారంభమైన ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు… అనేక సాంకేతిక లోపాలు కనిపించడం గమనార్హం. జనగామలో వెలుగుచూసిన సాగు భూముల రిజిస్ట్రేషన్‌ ఈ-‌చలానా చెల్లింపుల్లో మోసం వ్యవహారంలో రోజురోజుకు అనేక కొత్త విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఏసీబీ ఎస్పీ సింధుశర్మ నేతృత్వంలోని హైలెవెల్‌ ‌కమిటీ ఈ వ్యవహారంపై అన్వేషణ ప్రారంభించింది. స్టాంపులు-రిజిస్టేష్రన్ల శాఖ నిర్ణయించిన ప్రకారం… భూమి మార్కెట్‌(‌బుక్‌ ‌వాల్యూ) విలువలో 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ‌ఛార్జీ, మ్యుటేషన్‌కు ఎకరాకు రూ.2,500, పాస్‌ ‌పుస్తకానికి రూ.350, హరితపన్నుగా రూ.50… ప్రతి డాక్యుమెంట్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌సందర్భంగా చెల్లించాలి. మార్కెట్‌ ‌విలువ ఆన్‌లైన్‌లో ముందుగానే నిర్దారించి ఉంటుంది. సర్వే నంబరును ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే ఎంత చెల్లించాలనేది కంప్యూటర్‌ ‌తెరపైన కనిపిస్తుంది. చెల్లింపుల్లో ఏ ఒక్క రూపాయి తక్కువైనా ఆ రిజిస్ట్రేషన్‌ ఆటోమేటిక్‌గా తిరస్కారానికి గురవుతుంది. కానీ 4,800 లావాదేవీల్లో 1శాతం రుసుం మాత్రమే చెల్లించినా ఎక్కడా రిజిస్ట్రేషన్‌ ‌రిజెక్ట్ అవలేదు. ధరణి/భూభారతి పోర్టల్‌లో ఉన్న బలహీన సాంకేతికత అక్రమ లావాదేవీలకు ఆస్కారం కల్పించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ధరణిని ప్రైవేటు సంస్థ నిర్వహించగా ఇప్పుడు భూభారతి ఎన్‌ఐసీ చేతిలో ఉంది. ధరణి నుంచి భూభారతిగా మారిన తర్వాత కొనసాగిన లోపాలు, ప్రస్తుతం వెలుగు చూసిన ఈ-చలాన్ల సొమ్ము దారిమళ్లింపునకు అనుమతిచ్చిన సాప్ట్‌వేర్‌ ‌బలహీనతలపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్‌ ‌మంద మకరందు వీటిపై ఎన్‌ఐసీ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. సాగు భూముల రిజిస్ట్రేషన్లకు అత్తెసరు ఛార్జీలు చెల్లించినా వాటిని ఆమోదించి డీడ్స్‌పై సంతకాలు చేసిన తహసీల్దార్ల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌ ‌సెంటర్‌లో చలానా చెల్లించి నిర్దిష్ట తేదీన తహసీల్దారు-సంయుక్త సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌వద్దకు భూముల క్రయ, విక్రయదారులు, నలుగురు సాక్షులు కూడా వస్తారు. పాసుపుస్తకాలను, ఫొటోలను, సెల్‌ ‌నంబర్లను పరిశీలించ‌డం, రికార్డుల్లో ఉన్న వ్యక్తి, హాజరైన యజమాని ఒక్కరేనా అనేది తేల్చుకోవడం తహసీల్దారు బాధ్యత. దీంతోపాటు రిజిస్టేష్రన్‌ ‌ఛార్జీలను ప్రభుత్వ నిబంధనల మేరకే చెల్లించారా అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించడమనేది మరో ముఖ్యమైన విధి. ఈ విషయంలో ధరణి ఆపరేటర్‌ ‌ముఖ్య సహాయకుడిగా పనిచేయాలి. కీలక బాధ్యతల విషయంలో తహసీల్దార్లు, ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర అంశంగా రెవెన్యూ శాఖ భావిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *