– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అభినందన
ఖానాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : మున్సిపాలిటీ చిన్నదైనా ఇక్కడి ఫలితం మాత్రం పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే అని ప్రజలు చాటిచెప్పారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక ఆయన సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన అధికార దుర్వినియోగం, పోలీసుల ఒత్తిడి, గూండాయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించిందని, కానీ ఖానాపూర్ ప్రజలు, కౌన్సిలర్లు చెంపపెట్టి లాంటి తీర్పునిచ్చారని అన్నారు. కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఖానాపూర్‌ను మౌనిక అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ ఎన్నికలో తీసుకున్న నిర్ణయం వారి సొంతమేనని, దానికి బీజేపీతో ఎలాంటి పొత్తులు, ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు విచిత్రంగా ఉందన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. హైదరాబాద్‌లో ఇండస్ట్రీలు, ఎయిర్‌పోర్ట్ వంటి వనరులు ఉండటంతో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది కానీ అవేవీ లేని ఖానాపూర్ లాంటి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుందని రామచందర్‌రావు చెప్పారు. మరి అలాంటి ప్రాంతాలను విస్మరించాలా.. అక్కడి ప్రజల ప్రాతినిధ్యం తగ్గించాలా అని ప్రశ్నించారు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని మొత్తం ఒకటిగా చూస్తూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతోందన్నారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని, 1990 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగులోనే ఉందంటూ రాజీవ్ గాంధీ హయాంలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ముందుకు తీసుకురాలేకపోయారు.. యూపీఏ ప్రభుత్వంలోనూ పాస్ చేయలేదని విమర్శించారు. కానీ మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి మహిళలకు న్యాయం చేసిందని, ఇప్పుడు నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చారిత్రక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇది మహిళల రాజకీయ సాధికారతకు గొప్ప అవకాశంగా మారుతుందని చెప్పారు. మహిళా సాధికారత, మహిళా హక్కుల కోసం నిజంగా పోరాడుతున్నది బీజేపీ మాత్రమేనన్నారు. రైతు సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుబంధు అమలు లేదు.. రుణ మాఫీ సరిగా చేయలేదని రామచందర్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో కౌలు రైతు ఆత్మహత్య సంఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి మరో ఉదాహరణ అని అన్నారు. అటు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని అన్నారు. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అంటూ ఖానాపూర్ మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





