విద్యా రంగానికి మౌలానా ఆజాద్‌ సేవలు ఎన‌లేనివి

– ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఆజాద్‌ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం) సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్‌ చేసిన సేవలను ముఖ్యమంత్రి సోమవారం జరిగిన జయంతి కార్యక్రమంలో స్మరించుకున్నారు. సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌గా, వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 సంవత్సరాల్లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య, వృత్తి శిక్షణతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఏర్పాటు వంటి విభిన్న విధానాలతో దేశంలో విద్యారంగ ఆభివృద్ధికి ఆజాద్‌ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి రోజును (నవంబరు 11వ తేదీ) జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మౌలానా ఆజాద్‌ స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ)లుగా అప్‌ గ్రేడ్‌ చేశామని, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ఉపాధ్యాయులు, లెకర్చర్ల నియామకంతో రాష్ట్రంలో విద్యాభివృద్దికి పాటుపడుతున్నామని వివరించారు. జాతీయోద్యమంలో పాల్గొనడంతోపాటు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షునిగా ఆజాద్‌ ఎనలేని సేవలు అందించారని సీఎం కొనియాడారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని, జాతీయోద్యమములో హిందూ ముస్లిం ఐక్యతను కోరుకొని దేశ విభజనను వ్యతిరేకించారని సీఎం గుర్తు చేశారు. స్వాతంత్య్రం అనంతరం మైనారిటీలకు గొంతుకగా నిలిచారని, ఆజాద్‌ జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రజా ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, వారి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్న కా సహారా కింద ఫకీర్‌ పథకాలు ప్రారంభించి నిధులు కేటాయించినట్లు సీఎం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *