– రెండో దశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ
న్యూదిల్లీ,ఆగస్ట్11: చట్టబద్ధతను పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (Election Commission) కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ.. తాజాగా రెండో రౌండ్(second round) లో మరో 476 పార్టీలను గుర్తించి వాటిపై వేటు వేసే పక్రియను కొనసాగిస్తోంది. తాజాగా డీలిస్ట్ (de-list) చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఈసీ పేర్కొంది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే తొలి రౌండ్‌లో ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా.. రెండో దశలో మరో 476 పార్టీలను గుర్తించినట్లు వెల్లడించింది. తాము డీలిస్ట్ చేసిన పార్టీలేవీ.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29సీ, 29బీ ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తులు ఆర్డర్ 1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఈసీ స్పష్టం చేసింది.




