పర్యాటకం అభివృద్ధికి అవకాశాలు పుష్కలం

పర్యాటక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌, నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరుతో కలిసి సోమశిల, అమరగిరి ద్వీపం, ఇతర పర్యాటక ప్రాంతాలను మంత్రి బుధవారం సందర్శించారు. సోమశిల, అమరగిరి, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, నార్లాపూర్‌ రిజర్వాయర్‌, కొల్లాపూర్‌లోని మాధవస్వామి ఆలయం, జెటప్రోలు మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ నల్లమల ప్రాజెక్టుకు ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌/యూనియన్‌ టెరిటరీస్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టమెంట్‌(సాస్కి) పథకం కింద రూ.68.10 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో పర్యావరణం, జల వనరులు, ఆలయాలు, వాటర్‌ స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌ గేమ్స్‌కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశిల, అమరగిరి ద్వీపం, ఈగలపెంటను అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కొల్లాపూర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ నల్లమల ప్రాజెక్టు సంబంధించిన ప్రతిపాదనలు, కార్యాచరణపై పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. క్లస్టర్‌ 1: ఈగలపెంట అరైవల్‌ జోన్‌, ఈగలపెంట విహార యాత్ర, ఈగలపెంట రివర్‌ క్రూయిజ్‌, చెంచు ట్రైబల్‌ ఎక్స్పీరియన్స్‌, క్లస్టర్‌ 2: సోమశిల వెల్నెస్‌ అండ్‌ స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ ఉంటాయని అన్నారు. సోమశిలలో బోటింగ్‌ జెట్టి, అమరగిరి ద్వీపంలో బోటింగ్‌ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్‌ పూల్‌, కేఫ్టీరియా, స్పా, వెల్‌నెస్‌ సెంటర్‌, ఇండోర్‌ అవుట్‌ డోర్‌ గేమ్స్‌, ఇతర సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *