విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి

– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి

హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3: రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి లింగారెడ్డి మాట్లాడుతూ 2026-27 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కనీసంగా 20% నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు. విద్యారంగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను నియంత్రిస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలన్నారు. తెలంగాణ విద్యా విధానం-2026 పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, నిపుణులతో చర్చించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం.గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను తరగతి గదికి దూరం చేసే విధంగా, స్వేచ్ఛను హరించేలా చేపడుతున్న వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్యారంగం మరింత బలహీనపడుతుందే తప్ప బలోపేతం కావడానికి అవకాశాలు లేవన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల, పదవీ విరమణ పొందిన పెన్షనర్ల బకాయిలు రూ.వేల కోట్లT పెండింగ్‌లో ఉన్నాయని, తద్వారా తీవ్రమైన మానసిక, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని, ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అదేవిధంగా 2023 జూలై 1 నుండి అమలయ్యే విధంగా పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్ డీఏఈలు విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకంలో 1.5% బేసిక్ పే చెల్లింపు ఉపాధ్యాయ, ఉద్యోగులకు భారం కానున్నదని, ఆ వాటాను తగ్గించాలని, పథకంలో చేరేందుకు ఐచ్ఛికతను ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన బాధ్యులు జి.ఉప్పలయ్య, కె. శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు బి.అంజనీదేవి, డాక్టర్ ఎం.సారంగపాణి, అల్లం మల్లయ్య, డాక్టర్ ఎ.కిషన్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు ఎ.సంజీవరెడ్డి, ఎTన్.సుభాషిణి, డి.రమేష్, ఎం.హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *