హైదరాబాద్, ప్రజాతంత్ర : మొంథా తూఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రైతు స్వరాజ్య వేదిక (Swarajya Vedika) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెలాఖరులో మొంథా తూఫాను ప్రభావంతో 33 శాతం కంటే ఎక్కువ పంటలు నష్టపోఇయన జరిగిన రైతులను ప్రభుత్వం నమోదు చేసుకుని ఈనెల 11న జిల్లాల వారీగా వివరాలను ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో 1.17 లక్షల ఎకరాలు నష్టపోయినట్లు పేర్కొందని, అయితే రైతు స్వరాజ్య వేదిక నవంబరు 12న నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి పంట నష్టం నమోదులో జరుగుతున్న లోపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం ముఖ్య నిర్ణయాన్ని తీసుకుందని రైతు స్వరాజ్య వేదిక తెలిపింది. పంట నష్టం నమోదు చేసిన రైతుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించిందని, జాబితాలో నమోదు కానీ రైతుల వద్ద ఫిర్యాదులు తీసుకొని మరలా విచారిస్తున్నారని. ఈ చర్యను రైతు స్వరాజ్య వేదిక స్వాగతిస్తూ, ఈ ప్రక్రియను ప్రతీ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల రైతులకు ఈ సూచనలిచ్చింది.
రైతులకు కీలక సూచనలు
మీ గ్రామంలో ప్రదర్శించిన పంట నష్టం జాబితాను పరిశీలించండి. మీ పేరు నమోదు కాకపోయినా, లేదా మీకు తెలిసిన రైతులకు నష్టం జరిగి ఉంటే, వెంటనే AEO (Agricultural Extension Officer) ను సంప్రదించి మళ్లీ పంట పొలం పరిశీలన జరిపించాలి.
“తీవ్ర పంట నష్టం” అంటే ఏమిటి?
జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం సాధారణ పరిస్థితుల్లో ఎకరానికి 10 క్వింటాళ్లు దిగుబడిగా ఉండగా, వర్షాలు/వరదల వల్ల అది 6.5 క్వింటాళ్లు లేదా అంతకన్నా తక్కువకు పడిపోతే, అదే 33% కంటే ఎక్కువ పంట నష్టం — అంటే “తీవ్ర పంట నష్టం”గా పరిగణిస్తారు. ఈ పరిస్థితి మీకు తలెత్తితే AEOకి తప్పకుండా తెలియజేయాలి.
మీ గ్రామంలో జాబితా ప్రదర్శించకపోతే?
పంచాయతీ లేదా గ్రామ కేంద్రంలో జాబితా కనిపించకపోయినా AEOని సంప్రదించి వెంటనే పంట పొలాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయాలని కోరాలి.
తండాలు, ఆవాసాల్లో సర్వే మిస్సయినట్లయితే
కొన్ని ప్రాంతాల్లో ప్రధాన గ్రామంలో మాత్రమే సర్వే జరగగా, దూరప్రాంత తండాలు & ఆవాసాల్లో సర్వే చేయలేదని రైతులు తెలిపారు. అటువంటి రైతులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.
ఒక్కటి–రెండు పంటలే నమోదు చేసినట్లయితే
కొన్ని మండలాల్లో వరి, పత్తి మాత్రమే నమోదు చేసి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, ఇతర పంటల నష్టాన్ని నమోదు చేయని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పంటలు కూడా నష్టపోయి ఉంటే వెంటనే AEOకి సమాచారం ఇవ్వాలి.
మొదటి సర్వేలో పంట కోలుకుంటుందన్న అంచనా పెడితే?
నవంబరు మొదటి వారంలో సర్వే చేసినప్పుడు పత్తి, వరి పంట కోలుకుంటుందని భావించి తీవ్ర నష్టంగా గుర్తించకపోవచ్చు. నీ ఇప్పటికీ పంట కోలుకోకుండా ఉంటే AEO మళ్లీ పంటను పరిశీలించి నమోదు చేయాలి.
అదనపు సమాచారం కోసం రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులను సంప్రదించవచ్చు:
విస్సా కిరణ్: 9701705743
బి.కొండల్: 9948897734
కన్నెగంటి రవి: 9912928422
శ్రీహర్ష: 9966089839
ఆశాలత: 9490119242
నర్సింహులు: 8897039667
నవీన్: 9160309301





