పంచాయితీ ఎన్నికల్లో కోతులు, కుక్కలు ప్రధానాంశాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న అభ్యర్థులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కూడా ఇదే కావడంతో విధిలేక వాటి నివారణకు హామీలు ఇవ్వక తప్పటం లేదు. ఇది కేవలం ఏదో ఒకటి రెండు గ్రామాలకు సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలో అత్యధిక గ్రామాలు ఎదుర్కుంటున్న సమస్య . ఒక రాష్ట్రమని కూడా కాదు. ఇదిప్పుడు జాతీయ సమస్యగా మారింది కూడా. శునకాల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇంకా జనవరి 13న తుది తీర్పు ఇవ్వనుంది.
దేశంలోని అనేక రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతీరోజు కుక్క కాటుకు బలి అవుతున్న వారి గురించి వింటూనే ఉన్నాం. ముఖ్యంగా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వీధి కుక్కలు వెంట బడుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 20 కుక్కలు ఒకేసారి చిన్నారిపై దాడి చేసిన సంఘటన ఇటీవల చోటుచేసుకోవడం చూశాం. పాపం మాటలు కూడా రాని ఆ చిన్నారి ఇప్పుడు హైదారాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. అలా విద్యాసంస్థలు, బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లతో పాటు, ఇరుగ్గా ఉన్న వీధుల్లో వీటి ఆగడాలు ఎక్కువవుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో ఎక్కడా వీటి సంచారం లేకుండా స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని ఆత్యుత్తమ న్యాయస్థానం నవంబర్ 7న ఆదేశిస్తూ, అందుకు ఎనమిది వారాల గడువునిచ్చింది.
అయితే ఇంతవరకు ప్రభుత్వాలు పెద్దగా చర్యలేవీ చేపట్టినట్లు కనిపించడంలేదనడానికి తాజాగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి వెంటపడడంతో తీవ్రగాయాలతో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఇదే తరహాలో కోతుల బెడద కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నది. మనది వ్యవసాయక దేశం. నేటికీ గ్రామాల్లో జీవిస్తున్నవారు నూటికి డెబ్బది శాతం ఉన్నారు. ఎక్కువ శాతం వీరు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. అయితే ఒకపక్క ప్రకృతి సహకరించకపోవడం, నేటికీ కొన్ని ప్రాంతాల్లో సాగునీరు లభించకపోవడం ఒకటైతే నకిలీ విత్తనాల కారణంగా వ్యవసాయరంగం నష్టపోతున్న సంఘటనలు అనేకం నేటికీ వెలుగులోకి వొస్తున్నాయి. ఇన్ని కష్టాలు ఎదుర్కుని పంటసాగుచేస్తే కోతులు విధ్వంసం అంతా ఇంతా కాదు. రైతులు పండ్ల తోటలు, కూరగాయలను పండించుకోలేకపోతున్నారు.
వేరుశనగ, పప్పుదాన్యాలు, నూనెగింజలు లాంటివాటిని సాగు చేసుకోలేని పరిస్థితి. వరి తప్ప మరే ఇతర పంటను పండించే అవకాశంలేదు. చివరకు పత్తి, మొక్కజొన్న కర్రలను కూడా విరిచేసి నానా బీభత్సం చేస్తున్నాయి. ఒకేసారి గుంపులు గుంపులుగా చేనుల్లో పడి అవి చేసే విధ్వంసకాండకు రైతులు దిగాలుపడిపోతున్నారు. కనీసం వాటిని అదిలించాలన్నా భయపడిపోతున్నారు. మనుష్యులపై పడి గోళ్ళతో రక్కి పెడుతున్నాయి. గ్రామాల్లో ఇండ్లపై పెంకులను పెకిలించి పారేయడంతో గ్రామీణ జీవనాన్నికూడా అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇండ్లలో చొరబడి చేతికి అందింది దొంగలించుకుపోతున్నాయి. ధరలు ఆకాశాన్నంటిన ఈ రోజుల్లో కొని తెచ్చుకున్న నిత్యావసర వస్తువులను కూడా మర్కటార్పణం చేయక తప్పడంలేదు. ఇండ్లలో ఏకాస్తా ఏమరుపాటున ఉంటే ఇక అంతే సంగతులు.
తాజాగా ఇదే అంశాన్ని తెలంగాణ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంటులో లేవనెత్తారు. వీటి విషయంలో ఫిర్యాదు చేయాలంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమో చెప్పాలని ఆయన స్పీకర్‌ను ప్రశ్నించారు. ఇది కేవలం ఒక ప్రాంతమో, రాష్ట్రానికి సంబంధించిన సమస్యో కాదు. జాతీయ సమస్య కాబట్టి చర్యలు కూడా ఆ స్థాయిలో ఉండాలంటారాయన. చూడడానికి, వినడానికి ఇది చిన్న విషయం అనిపిస్తుంది, కాని దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్య నివారణకు ఒక నోడల్ ఏజెన్సీ అవసరమని ఆయన సూచన చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఇవే ప్రధానాంశాలుగా మారాయి. పంచాయితీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా పోటీపడుతున్న అభ్యర్థులను స్థానిక వోటర్లు ఇదే అంశం పైన నిలదీస్తున్నారు. కోతులు, కుక్కల బెడద తీర్చిన వారికే తమ వోటు అంటూ పెద్ద పెద్ద బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ముందుగా ఈ బెడద తీర్చిన తర్వాతే తమను వోటు అడగాలని కూడా షరతు పెడుతున్నారు.
కోతులు, కుక్కల బెడద నివారిస్తేనే వోటు వేస్తామంటూ మంచిర్యాల జిల్లా దండెపల్లి గ్రామస్తులంతా బ్యానర్‌లతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో, హనుమకొండ జిల్లా నేరెళ్ళ గ్రామం తో పాటు అనేక గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే నెలకొంది. దీంతో పోటీ చేసే అభ్యర్ధులు వారి డిమాండ్‌కు తలవొగ్గని పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ అభ్యర్థులు కొందరు ఇప్పటికే గ్రామస్తుల మెప్పు పొందేందుకు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మంచిర్యాలజిల్లా దండేపల్లిగ్రామ సర్పంచ్ అభ్యర్థి ఏకంగా కొండముచ్చును తెప్పించి ప్రజల మన్నలను పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో తమ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదనో, సాగు, తాగు నీరు సదుపాయం కల్పించాలనో, తమ గ్రామానికి బడికావాలనో, గ్రామ పరిశుభ్రతకు కాలువలు కావాలనో, గుడి పునరుద్ధరణ చేయాలనో గ్రామస్తుల కోరిక చిట్టాకు బదులుగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కోతులు, కుక్కలను నివారించాలంటూ గ్రామీణ ప్రజలు తీసుకున్న ఈ కొత్త తరహా నినాదం వింతగా ఉంది.