– ఆయుధాలు వదిలి 71 మంది లొంగుబాటు
– లొంగిపోయివారిలో అగ్రనాయకులు ఉన్నారు
– 30మందికి రూ.64లక్షల రివార్డు అందజేత
21 మంది మహిళలు- మిగిలిన వారు పురుషులు
భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 71 మంది మావోయిస్టులు పోలీసుల వద్ద లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిలాలలో బుధవారం నాడు 71 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు.వీరిలో ఎక్కువమంది అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తుంది.మావోయిస్టుల లొంగుబాటు దంతెవాడ ఎస్పీ కార్యాలయంలో జరిగింది.ఈ మీడియా సమావేశంలో బస్తర్ ఐజి సుందర్‌రాజు,దంతెవాడ రేంజ్ డిఐజి కమలోచన్ కశ్వన్,సిఆర్‌పిఎఫ్ ఐజి రాకేష్‌చౌదరి, ఎస్పీ గౌరవ్‌రాయ్, ఏఎస్‌పి రామ్‌కుమార్‌బర్మన్ లు ఉన్నారు.వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీలో చీలికలు, విభేధాలు వచ్చినట్లు తెలుస్తుంది.దీనికి కారణంగా మావోయిస్టు ఉద్యమాన్ని,ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయుదాలతో బుధవారం నాడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సంఘటన మావోయిస్టు ఉద్యమానికి మరో తీవ్రమైన దెబ్బగా మారింది.దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ మాస్ సరెండర్‌కు ‘లోన్ వర్రాటు’ మరియు ‘పూనా మార్గెమ్’ అభియాన్‌లు ప్రధాన కారణంఅని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ 71 మందిలో 30 మందిపై మొత్తం 64 లక్షల రూపాయల రివార్డు ఉంది. వారు మునుపటి ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్టు, రోడ్లు తవ్వడం, చెట్లు నరికివేయడం, ప్రచారాలు చేయడం వంటి అంతరాయ కార్యకలాపాల్లో భాగమై ఉన్నారు. ఈ సరెండర్‌ను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , బస్తర్ ఫైటర్స్, ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లు సహకరించాయి. మావోయిస్టులు పార్టీలోని అసమానతలు, అణచివేతలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకున్నారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడిందన పోలీస్ అధికారులు వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, వృత్తి చేతివొప్పు శిక్షణ, వ్యవసాయ భూములు, ఇతర పునరావాస సౌకర్యాలు అందిస్తోందని వివరించారు. లొంగిపోయిన వారిలో 17 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. బస్తర్ రేంజ్ పోలీసులు ప్రారంభించిన లోన్ వర్రాటు, పూనా మార్గెం పునరావాస కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా కూడా తాము ఆకట్టుకున్నామని నక్సలైట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో బామన్ మడ్కం , మంకి అలియాస్ సమిలా మాండవి లకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు, షమిలా అలియాస్ సోమ్లి కవాసి, గంగి అలియాస్ రోహ్ని బార్సే , దేవే అలియాస్ కవితా మాందవి , సంతోష్ మాండవి లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించినట్లు తెలిపారు.తరచూ జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో అనేక మంది అగ్రనాయకులను మావోయిస్టు పార్టీ నష్టపోయింది.ముఖ్యంగా తెలంగాణాకు చెందిన వారు ఎక్కువుగా ఉన్నారు.ఇదిగమనించిన మావోయిస్టుపార్టీ ఆయుధాలు వదిలి లొంగిపోవాలనే ఉధేశ్యంతో బుధవారం నాడు 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





