– లెబనాన్‌పై దాడిలో హిజ్బుల్ చీఫ్ మృతి
– సౌదీ వార్త ‘అల్ హదత్’ ధ్రువీకరణ
లెబనాన్, మార్చి2: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. లెబనాన్ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో లెబనాన్ పార్లమెంట్‌లోని హెజ్‌బొల్లా బ్లాక్ అధిపతి మహ్మద్ రాడ్ మరణించారు. ఆయన మృతిచెందినట్లు సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్త ‘అల్ హదత్’ పేర్కొంది. దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలపై సోమవారం ఇజ్రాయెల్ రక్షణ దళంవైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహ్మద్ రాడ్ మృతిచెందారు. ఈ ఉగ్రసంస్థకు చెందిన మరికొంద రు ఉన్నతాధికారులు కూడా తమ దాడుల్లో మృతిచెందారని ఐడీఎఫ్ తెలిపింది. వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 31మంది మృతిచెందగా 149మంది గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. హెజ్‌బొల్లా నేతలు లెబనాన్ రక్షణ కంటే ఇరాన్ కోసం ఎక్కువ పనిచేశారని, వారి చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఐడీఎఫ్ అధికారి రఫీ హెచ్చరించారు. మొదట హెజ్‌బొల్లా తమపై రాకెట్ దాడులకు పాల్పడడం వల్లే ప్రతి దాడులు చేశామని తెలిపారు. మరోసారి వారు ఇటువంటి చర్యలకు దిగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా లెబనాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, కీలక నేతల కార్యాలయాలపై దాడులు చేపట్టామన్నారు. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక విభాగాల్లో కీలక పాత్ర పోషించే రాడ్ మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హెజ్‌బొల్లా ఆయుధాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ ’ఆపరేషన్ రోరింగ్ లయన్’ను వేగవంతం చేసింది. మరిన్ని దాడులు చేయడానికి ముందు దక్షిణ లెబనాన్‌లోని 50 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా అక్కడి ప్రజలకు సూచించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఇజ్రాయిల్ దాడుల్లో 550 మంది మృతి
టెహ్రాన్ : అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. క్షిపణి స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తోంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కాగా, శనివారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకూ తమ దేశంలో ఇరాన్ సుప్రీం లీడర్, ఇతర సీనియర్ అధికారులు సహా 550 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ మిలటరీ కమాండర్లు ప్రకటించారు. యూఏఈ సహా గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తాజా పరిస్థితి యావత్ మధ్యప్రాచ్యాన్ని యుద్ధం వైపు నడిపే అవకాశాలున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్ ఎయిర్ పోర్ట్, బుర్జ్ ఖలిఫా, బహ్మాన్, కువైట్‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. మరోపైపు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్పస్ (ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయానికి ధ్వంసం చేసినట్టు అమెరికా మిలటరీ ప్రకటించింది.
యుద్ధం మరో 4-5 వారాలు పట్టవచ్చు : ట్రంప్ షాకింగ్ ప్రకటన
యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ ప్రకటన చేశారు. ’ఆపరేషన్ ఎపిక్ క్యూరీ’లో భాగంగా ’ఒకే షాట్’లో 48 మంది ఇరానియన్ టాప్ లీడర్లను మట్టుపెట్టామని తెలిపారు. తొమ్మిది యుద్ధ నౌకలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇరాన్ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశామని, ఈ చర్యలో కనీసం ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు. యుద్ధం మరో 4-5 వారాలు పట్టవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.




