– వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున నిరసనలు
– భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్
న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను తగలబెడతామని తెలిపింది. బికెయు నేత రాకేశ్ టికాయత్ న్యూదిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల పరిరక్షణ గురించి మోదీ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని విమర్శించారు. 1992లో భారత్ తన ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచి విదేశాలను అనుమతించిందని, ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉన్నదని ఆయన చెప్పారు. ’భారత్-అమెరికా ఒప్పందం జరిగిన తీరు చూస్తుంటే అది మన దేశానికి ప్రమాదకారిగా కన్పిస్తోంది. కాబట్టి దానిపై మనం గళం విప్పాల్సిందేనని అన్నారు. ఇది ఏకపక్ష ఒప్పందమని, ఒత్తిడితో కుదుర్చుకున్నదని చెప్పారు. ఈ ఒప్పందం భారత రైతులకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అమెరికా మన దేశంలోకి సబ్సిడీతో కూడిన వస్తువులను కుమ్మరిస్తుందని, ఫలితంగా మన రైతులు తమ ఉత్పత్తులను విక్రయించలేరని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడతామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని విలేకరులు ప్రస్తావించగా అది అబద్ధం చెబుతోంది. వారు ఏమైనా చెప్పుకోనివ్వండి. నిరసనలు తప్పవు అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను గ్రామాలలో రైతులు దగ్థం చేస్తారని, ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతారని అన్నారు. మా ట్రాక్టర్లకు దిల్లీ ఎంతో దూరంలో లేదు. అవి సిద్ధంగానే ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందం భారత్కు న్యాయసమ్మతం కాదని ఆర్జేడీ ఎంపి సుధాకర్ సింగ్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమైన ఒప్పందం కాదని, భారత్ 18 శాతం సుంకం కడుతుంటే అమెరికా మాత్రం సున్నా టారిఫ్కే పరిమితం అవుతోందన్నారు. ప్రతిపాదిత విత్తన బిల్లును కూడా ఆయన వ్యతిరేకించారు. రైతులు అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు. అమ్ఆద్మీ పార్టీ ఎంపి సంజరు సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ కూడా మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





