– స్యూరిటీ లేకుండా రుణాలిస్తున్నారు
– డిజిటల్ ట్రాన్సాక్షన్ ధనవంతులకే కాదు.. పేదలకూ చేరింది
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: అంతరిక్ష రంగం నుంచి అన్ని రంగాల్లో మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని, వారికి అన్ని విధాల తోడ్పాటునందిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందిన మహిళలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారస్తులకు బ్యాంకుల్లో స్యూరిటీ లేకుండానే రుణాలందించే ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పుడు పేదలు కూడా సులువుగా బ్యాంకు ఖాతాలు తెరిచేలా జన్ ధన్ యోజన తీసుకొచ్చారని చెప్పారు. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితమైన డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరి ఇంటకి వచ్చిందని చెప్పారు. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేశామని, డ్రోన్ దీదీ కార్యక్రమం ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. లక్ పతి దీదీ పథకం ద్వారా ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. విప్లవాత్మక నిర్ణయం తీసుకుని మహిళలు మైనింగ్ రంగంలో కూడా పనిచేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతీ మహిళ సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలు ఏ రకమైన వ్యాపారం చేయాలనుకున్నా తాను సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఏ రకమైన శిక్షణ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బస్తీల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లను నిరుపయోగంగా ఉంచకుండా మహిళలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గతంలో స్వయం సహాయక సంఘాలకు మహా అయితే రూ.50 వేల వరకు రుణాలు ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారని, దీన్ని రూ.50 లక్షలకు పెంచేందుకు సిద్దంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ ప్రతిక్షణం పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో వాజపేయి స్ఫూర్తితో పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క మహిళకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారని, నాలుగు కోట్లమంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించారని, ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఏర్పాట్లు చేశారని ఆయన వివరించారు.
స్వయం సహాయక సంఘాలు క్రియాశీలకం: గవర్నర్
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ గతంలో స్వయం సహాయక సంఘాలు నామమాత్రంగా ఉండేవని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో స్వయం సహాయక సంఘాలను క్రియాశీలకంగా మలిచారని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా నాలుగు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారని, జన్ ధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాలను తెరిపించారని వివరించారు. వికసిత్ భారత్‌లో కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళలు ఆర్థికంగా బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుందని చెప్పారు. మహిళలు కొత్త స్కిల్స్ నేర్చుకుంటే కుటుంబంతోపాటు దేశానికి కొత్త దశ, దిశను తీసుకురావచ్చని చెప్పారు.
మహిళల ఆర్థిక బలోపేతానికే స్కిల్ సెంటర్లు : కావ్య కిషన్‌రెడ్డి
ఏబీవీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కావ్యా కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంలో స్కిల్ సెంటర్లను ప్రారంభించామని, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 15కు పైగా స్కిల్ సెంటర్లు ఉన్నాయని, 25 వేలకు పైగా మహిళలు ఈ సెంటర్లలో శిక్షణ పొంది సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారని వివరించారు. ఈ కేంద్రాల ద్వారా వారి బిజినెస్ కూడా మరింతగా వృద్ధి చెందేందుకు దోహదపడుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టారన్నారు. డ్రోన్ దీదీ, బేటీ పఢావో, బేటీ బచావో, సుకన్య సమృద్ధి, ముద్ర రుణాలు వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




