– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని
– పూర్ణకుంభంతో స్వాగతించి ఆశీర్వదించిన పండితులు
శ్రీశైలం,అక్టోబర్16: కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు వేదోక్తంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు. ఆలయానికి చేరుకున్న ప్రధానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రధాని మోదీ శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రధానికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనాననంతరం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను దర్శించు కున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. ఈ కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్టు నిర్వాహకులను ప్రధాని మోదీ అభినందించారు. అక్కడి నుంచి భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట వద్ద సుమారు 1500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





