గాంధీ అన్నా,పేదలన్నా మోదీకి నచ్చదు

– నరేగా రద్దుతో పేదల ఉపాధికి పెద్ద దెబ్బ
– ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కూడా ఎత్తేస్తారా
– కేంద్రంపై మండిపడ్డ విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ
– పార్లమెంట్‌ ‌వరకు నిరసనలు తెలుపుతామని వెల్లడి

న్యూదిల్లీ, డిసెంబర్‌ 16: ‌మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టడాన్ని లోక్‌స‌భ‌లో విపక్ష ‌నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంటు వరకు ర్యాలీగా వెళ్లి తమ నిరసనను తెలియజేస్తాయన్నారు. మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులపై ప్రధాని మోదీకి ముందు నుంచి తీవ్రమైన అయిష్టత ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే గాంధీ ఆలోచనకు ఎంజీ నరేగా  ఓ సజీవ స్వరూపం. ఎన్నో ఏళ్లుగా ఇది లక్షలాదిమంది గ్రామీణ ప్రజలకు జీవనాడిగా ఉంది. కొవిడ్‌ ‌సమయంలో కూడా పేదలకు ఆర్థిక భద్రతను ఇచ్చింది. కాంగ్రెస్‌ ‌తీసుకువచ్చిన ఈ పథకం ప్రధాని మోదీని ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంది. కాబట్టి దీనిని బలహీనపరిచేందుకు కేంద్రం పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దీనిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని రాహుల్‌ ‌సోషల్‌ ‌మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో కేంద్రంపై రాహుల్‌ ‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతీ ఏడాది 100 రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హాని అందించే పథకాన్ని రద్దు చేయాలని మోడీ సర్కార్‌ ‌యోచిస్తోందని మండిపడ్డారు. కేంద్రం కొత్తగా రోజ్‌గార్‌, అజీవిక మిషన్‌ ‌బిల్లు-2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానమని, నిరుద్యోగం ద్వారా దేశ యువత భవిష్యత్తును నాశ‌నం చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ పేదల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

17‌న కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్త  ఆందోళన

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పునకు వ్యతిరేకంగా ఈనెల‌ 17‌న దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్‌  ‌పిలుపు నిచ్చింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు హక్కుల ఆధారిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, దానిని కేంద్రం నుండి నియంత్రించే దాతృత్వ సంస్థతో భర్తీ చేసేందుకు యత్నిస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. గాంధీజీ వారసత్వంపైన, కార్మికుల, వారి హక్కుల‌పై బిజెపి  దాడి చేస్తోందన్నారు. మహాత్మాగాంధీ పేరును, ఆయన విలువలను తుడిచేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా 17‌న జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గాంధీజీ చిత్రపటాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ ‌మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *