రాష్ట్రానికే మోడల్ కాలనీ తలమానికం

– పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ
– పైరవీలకు ఆస్కారం ఉండదు
– తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక
– నిశితంగా పరిశీలించిన త‌ర్వాతే జాబితా విడుదల
– మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్
– ఈ నెలాఖ‌రుకు మోడల్ కాలనీ ప్రారంభం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 07: : హుజుర్ న‌గర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో 116 ఎకరాల విస్తీర్ణంలో 2,160 సింగిల్ బెడ్ రూమ్ లతో నిర్మించిన మోడల్ కాలనీ రాష్ట్రానికే తలమానికం కానుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మోడల్ కాలనీని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్.డి.ఓలతోపాటు గృహా నిర్మాణ శాఖాధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ వెంట ఉన్నారు.  ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ మోడల్ కాలనీ పనులను ఉద్దేశ్య పూర్వకంగా ఆటకెక్కించడంతోటే ఇంతటి జాప్యం కలిగిందన్నారు. అప్పటికే 90 శాతం మేర పనులు పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న కోణంలో నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రావడంతో పనులు వేగవంతం చేశామన్నారు. మారుతున్న పరిస్థితిలకనుగుణంగా మోడల్ కాలనీని తీర్చిదిద్దుతున్నామని, అందులో భాగంగానే భూమి కొనుగోలుకు చేసిన వ్యయం మినహాయించి మొత్తంగా ఒక్క నిర్మాణానికే రూ.125 కోట్లు వెచ్చించడంతో పాటు మరో 20 కోట్లు తాజాగా మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. పదికోట్లతో మోడల్ కాలనీలో తెలంగాణా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు మరో పది కోట్లతో ఇదే కాలనీలో అంగడి వాడి కేంద్రం, కమ్యూనిటీ హల్,క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్,ఓపెన్ జిమ్ ఏర్పట్లతో పాటు సి.సి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ మాసాంతానికి మోడల్ కాలనీ ప్రారంభోత్సవం ఉంటుం దని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. ప్రారంభోత్స‌వానికి ముందే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అందులో మొదటి విడతలో అధికారులు 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ఆయన ప్రకటించారు. అయితే అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుందని బహిరంగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హుజూర్ న‌గర్ కే ఐకాన్ గా నిలబడనున్న ఈ మోడల్ కాలనీ లబ్ధిదారుల ఎంపికలో అపోహాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని నిష్పక్షపాతంగా ఎంపిక ఉంటుందని, అదే సమయంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సిఫార్సులు కుడా అర్హులైన వారే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనర్హులను సిఫార్సు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల జాబితాను ఒకటికి రెండు సార్లు నిశితంగా పరిశీలించాలని జాబితాలో ఒక్క అనర్హుడి పేరు ఉన్నా మోడల్ కాలనీ నిర్మాణ సంకల్పం దెబ్బ తింటుందని ఆయన అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉంటుందని ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారం ఉండదని ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరించారు.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *