కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకం చెల్లదు

– గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీమ్‌ ‌ఉత్తర్వులు
– వీరి ఎంపికపై దాసోజ్‌ ‌శ్రవణ్‌, సత్యనారాయణ ‌పిటిషన్‌
‌- తదుపరి విచారణ సెప్టెంబర్‌ 17‌కు వాయిదా

న్యూదిల్లీ, ఆగస్ట్‌ 13: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకాలను రద్దు చేసింది. బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణల పిటిషన్‌లపై విచారణ జరిపింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని తేల్చిచెప్పింది. బుధవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 2024 ఆగస్టు 14 నాటి తీర్పులో మార్పులు చేస్తూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, అర్‌ అలీఖాన్‌ నియామకాలపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులకనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడాన్ని తప్పుపపట్టింది. గతంలో వీరి ఎంపికపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులకనుగుణంగా ఎంపిక ఉండాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ప్రభుత్వం దాసోజు శ్రావణ్‌, సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. వీరిద్దరి అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్‌ తమిళసై తిరస్కరించారు. దాంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అనంతరం 2024 జనవరి 13న ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అలీఖాన్‌ పేర్లను రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిపాదించగా గవర్నర్‌ వీరి అభ్యర్థిత్వాలను ఆమోదించారు. గవర్నర్‌ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించగా కోదండరామ్‌, అలీఖాన్‌ నియామకాలను రద్దు చేసింది. రేవంత్‌ సర్కారు మళ్లీ అవే పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. గవర్నర్‌ ఆమోదంతో ఇద్దరూ ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. దీనిపై ఆగస్టు 4న దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ కార్యాలయం సైతం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 17‌వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయమైౖ ఎమ్మెల్సీ అలీఖాన్‌ స్పందించారు. సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదన్నారు. కోర్టు ఆర్డర్‌ చదివిన తర్వాత అన్నీ మాట్లాడతానన్నారు. లాయర్‌ ఫోన్‌ చేసి సుప్రీం కోర్టులో జరిగిన విషయాలు చెప్పారని వివరించారు. తాను మొన్నటివరకు జర్నలిస్టునని, ఎలాంటి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్‌ లేదని తెలిపారు. తనతో ఇంకా ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *