తప్పుడు ఆరోపణలు చేస్తే కాళ్లు విరగ్గొడతా

– ఎప్పటికైనా నేనూ ముఖ్యమంత్రిని అవుతా
– బిఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై విచారణ చేయిస్తా
– పదేళ్ల పాలనలో ఒక్క రూపాయి సంపాధించలేదు
– పార్టీ నుంచి బయటకు పంపినా వారి కళ్లు చల్లారలేదా
– తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న హరీష్‌ , ఏలేటి , మాధవరంలకు నోటీసులు
– వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌12: ‌రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం లీగల్‌ ‌నోటీసులు పంపించారు. తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్‌ ‌చేశారు. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు, బీఎర్‌ఎస్‌ ‌టార్గెట్‌గా జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్‌, కేటీఆర్‌, ‌కేసీఆర్‌ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు. ఉద్యమంలో ఎవరు ఏమి చేశారనేది తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆమె శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మహేశ్వర్‌ ‌రెడ్డి, కృష్ణారావులతో హరీష్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌నేతల అక్రమాలు తన దృష్టికి వొస్తున్నాయని, అసలు కథ ముందుంది అంటూ కామెంట్స్ ‌చేశారు. తాను మంచి దాన్ని కాదు.. కాళ్ళు విరగొడతానంటూ హెచ్చరించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో తాను, తన భర్త ఒక్క పని అయినా అడిగామా అని ప్రశ్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని, బీఆర్‌ఎస్‌లో 10 ఏళ్లలో ఒక్క రూపాయి సంపాధించ లేదని స్పష్టం చేశారు. ఏలేటి, మాధవరం వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. తనను పార్టీ నుంచి పంపించారని, అయినా వాళ్ల కళ్ళు చల్లబడలేదా అని నిల‌దీశారు. తనపై ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా జవాబు చెబుతానన్నారు. బీఆర్‌ఎస్‌ ‌వాళ్ళు తప్పు చేశారనే రేవంత్‌ అధికారంలోకి వొచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో జరిగిన లావాదేవీలకు, కాంగ్రెస్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. ‘నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా.. హరీష్‌ ‌రావు విజ్ఞత అని తప్పించుకుంటున్నారు. లైన్‌లు నేను దాట లేదు. నేను ఇంక ఊరుకోను ’ అంటూ కవిత సంచలన కామెంట్స్ ‌చేశారు. కాంగ్రెస్‌తో అంటకాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలూ.. జాగ్రత్త అని హెచ్చరించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. దమ్ముంటే నా ఆరోపణలకు సమాధానం ఇవ్వండి. నాకు ఎవరితోనూ అవగాహన లేదు.. వ్యాపారాలు లేవు. మాధవరం కృష్ణారావుకు నోటీసులు పంపుతున్నా అన్నారు.
వారంలో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తాను. ఏవీరెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి భూలావాదేవీలు ఉన్నాయి. శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం కేటీఆర్‌ ‌వద్ద ఉంటారు. ఆయన ఎవరి బినామీనో చెప్పాలి. మాధవరం చాలా చిన్న వ్యక్తి. ఓ గుంట నక్క ఆయన వెనక ఉండి ఆడిస్తోంది. కృష్ణారావు బాధితులు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ప్రణీత్‌, ‌ప్రణవ్‌ ‌కంపెనీల్లో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్‌. ఆ ‌కంపెనీల విల్లాలన్నీ కబ్జాల్లో కట్టినవే. వెంచర్‌ ‌మధ్యలోని 10 ఎకరాల చెరువు 6 ఎకరాలకు ఎలా తగ్గిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా ఆ చెరువు సంగతి చూడాలి. కేటీఆర్‌ ‌మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట చెరువునే మింగేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనతో నాకు సంబంధం లేదు. ఎంపీగా ఉన్నప్పుడు దిల్లీ, నిజామాబాద్‌కే పరిమితమయ్యా. హిల్ట్ ‌పాలసీకి బీఆర్‌ఎస్‌ ‌కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్‌ ‌ద్వారాలు తెరుస్తోంది. నాతో పాటు నా భర్తపై బీఆర్‌ఎస్‌ ‌విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయి. దేవుడి దయతో నేను ముఖ్యమంత్రి అవుతాను. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తాను అని కవిత వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. మొదటగా ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలో జనం బాట చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్‌, ‌హైదరాబాద్‌ ‌జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు.  స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

హామీలే తప్ప అమలు లేదు : పాత బస్తీ స‌జనం బాటలో కవిత 

హైదరాబాద్‌ ‌నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైదాబాద్‌లో స్టీల్‌‌ బ్రిడ్జి పనులను పరిశీలించి ఐదేళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందే లేదని విమర్శించారు. పాత బస్తీలో పర్యటిస్తే గోతులమయంగా మారిన రోడ్లు, 30ఏళ్ల క్రితం వేసిన మ్యాన్‌హోళ్లు తప్ప నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు కనిపించడంలేదన్నారు. పురాణ షహర్‌ ‌కాదు.. హమారా షహర్‌ అని, అందరితో సమానంగా అభివృద్ధి జరగాలని కోరారు. గౌలిపురా ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలన్నారు. పాత బస్తీ అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ బ్టడెట్‌ ఇచ్చి చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. ముసారాంబాగ్‌ ‌చౌరస్తాలో ఎస్సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో దానిపై ఆధారపడిన చాలామంది చదువులకు దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. హామీ ప్రకారం విద్యార్థులకు స్కూటీలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులు, హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 42 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మార్కెట్‌లో కనీస సౌకర్యాలు, పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. యాకుత్‌పుర నియోజకవర్గం సింగరేణి కాలనీ, ఖాజాబాగ్‌, ‌చింతల బస్తీల్లో కవిత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుడిసెవాసులతో సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు వచ్చినా బస్తీల్లో కనీస మౌలిక సదూపాయాలు లేక ప్రజలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు శైలజా గౌడ్‌, ‌రాధాకృష్ణ, ఆశిశ్‌ ‌దూబె, సాయి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *