– కేసీఆర్ లేకుంటే ఆయన ఎవరు?
– ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 3: ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్ పార్టీ నేతలపైనే మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక లిల్లీపుట్ అని ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈరోజు హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల జగదీష్ రెడ్డి ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై చేసిన వ్యాఖ్యలకు కవిత ఈరోజు కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక పార్టీకి చెందిన కీలక నేత ఉన్నారని ఆరోపించారు. జగదీష్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిందే జగదీష్‌రెడ్డి అని విరుచుకపడ్డారు. నా మీద నీచంగా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అంటూ ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్‌ఎస్ సోదరులు మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా తండ్రికి రాసిన లేఖను బహిర్గతం చేశారని అన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు.. ఆయన నాకు తెలుసు కానీ.. గత ఆరు నెలల్లో ఎప్పుడూ మాట్లాడలేదని కవిత అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే నా వెనుక ప్రభుత్వం ఉందని ఆరోపిస్తే ఎలా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ నాయకులే తనపై అనుచితంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.





