– అనుమతి ఇవ్వకుంటే ఎక్కడుంటే అక్కడే దీక్ష
– జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి కోరి దీక్షకు దిగుతానని, ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ ఉంటే అక్కడే దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను 72 గంటలు దీక్ష చేస్తే నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2018 పంచాయతీరాజ్ సవరణ చట్టంపై తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్‌తోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందని చెప్పారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారని, మరి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండిరగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఒప్పందం కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని కవిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు. తాము ఢల్లీిలో చేసే ధర్నాకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు.. ఇదేమైనా సత్రం భోజనమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని, దిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీలకు ప్రభుత్వం లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా శూన్యం అని, రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తప్పించుకుంటోందని విమర్శించారు. బీసీ సీఎం, బీసీ పీఎం అంటున్న బీజేపీకీ బీసీలపై చిత్తశుద్ధి లేదని కవిత ధ్వజమెత్తారు.





