– ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
– ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ప్రజాతంత్ర, జులై 20 : అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, పిట్టంపల్లి, వెలిమినేడు, గుండ్రాంపల్లి గ్రామాలలో మంజూరౖెెన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. మొదటి దశలో ఇండ్లు మంజూరు కాని వారికి రెండో దశలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినామని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ మీ గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పింఛన్‌లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని పలువురు ప్రజలు ఎమ్మెల్యేని కోరగా పూర్తి వివరాలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, ఎంపీఓ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, నాయకులు పోకల దేవదాస్, కంచర్ల వెంకటరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, జనగాం రవీందర్ గౌడ్, వెలిమినేడు పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, పంచాయతీ కార్యదర్శులు, పలువురు నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



