మళ్ళీ కెసిఆర్ రావాలి, తెలంగాణకు పూర్వ వైభవం తేవాలని, యావత్ రాష్ట్రప్రజానీకం ఎదురు చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.ఏదో మార్పు తెస్తారని అనుకోని కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడని విమర్శించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హరీష్ రావుకు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా మంచిగా కాలం కావాలని, మంచి పంటలు పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.మన తెలంగాణకు పూర్వవైభవం రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు.కెసిఆర్ హాయాంలో రైతుబంధు పైసలు వెంటనే వేసే వాడని ఈ కాంగ్రెస్ పాలనలో అంతా సగం సగం రైతు బంధు పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.
ఈ టైంలో రైతులకు అందించాల్సిన పచ్చి రొట్ట ఎరువులు జనుము, జీలుగ విత్తనాలకు ఇంత వరకు దిక్కు లేవని, గత బీఆర్ఎస్ కెసిఆర్ పాలనలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా దుక్కి దున్నే సమయానికి రైతు బంధు వేయడం జరిగిందని పేర్కొన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం రైతుబంధుకు రామ్ రామ్ చెప్పి యాసంగి రైతు బంధు సగం సగం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని ఎద్దేవా చేశారు.రాష్టానికి కావాల్సింది అందాల పోటీలు కాదని తెలంగాణ పూర్వ వైభవం కోసం ప్రజలు ఎదురు చూస్తుందని అన్నారు




